బీఆర్ఎస్ వికెట్ నంబర్ 8: కాంగ్రెస్‌లో చేరిన చంద్రబాబు శిష్యుడు
Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. తన దూకుడును కొనసాగిస్తోంది. ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితిని ఖాళీ చేసే పనిలో పడింది. ఇప్పటికే పలువురు శాసన సభ, శాసన మండలి సభ్యులు బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పారు. మాజీ ఎంపీలు సైతం అదే బాట పట్టారు.
చేరికల విషయంలో రేవంత్ రెడ్డి.. పంజా విసురుతున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల నుంచే గేట్లు ఎత్తేశారు. దీనికి దెబ్బకు ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి కకావికలమౌతోంది. తేరుకోలేకపోతోంది. అధికారంలోకి వచ్చిన ఈ తొలి ఆరు నెలల వ్యవధిలోనే బీఆర్ఎస్‌కు చెందిన పలువురు సీనియర్ నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు.

రాజకీయ జీవితంలో కాంగ్రెస్‌కు బద్ధ వ్యతిరేకంగా ఉంటూ వచ్చిన కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి వంటి నేతలు సైతం ఆ పార్టీలో చేరిపోయారు. కే కేశవరావు, ఆయన కుమార్తె గద్వాల్ విజయలక్ష్మి, రాములు, బీబీ పాటిల్, వెంకటేష్ నేత, పసునూరి దయాకర్, రంజిత్ రెడ్డి, బొంతు రామ్మోహన్, టీ రాజయ్య, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, పట్నం సునీత మహేందర్ రెడ్డి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కాలె యాదయ్య.. వంటి ఎంతోమంది బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పిన వారిలో ఉన్నారు.
మొన్నటికి మొన్న.. ఆరు మంది ఎమ్మెల్సీలు బీఆర్ఎస్‌ను వీడారు. దండె విఠల్, భానుప్రసాద్ రావు, ఎంఎస్ ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్య.. కాంగ్రెస్‌లో చేరారు. ఈ విషయంలో అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడాలు కూడా చూడట్లేదు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని అర్ధరాత్రి హైదరాబాద్‌కు రాగా ఆయన సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఇప్పటివరకు మొత్తం ఏడుమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కడియం శ్రీహరి- స్టేషన్ ఘన్‌పూర్, దానం నాగేందర్- ఖైరతాబాద్, తెల్లం వెంకట్రావ్- భద్రాచలం, పోచారం శ్రీనివాసరెడ్డి- బాన్సువాడ, డాక్టర్ ఎం సంజయ్ కుమార్- జగిత్యాల, కాలె యాదయ్య- చేవెళ్ల, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి- గద్వాల.. కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు.
తాజాగా- రాజేంద్రనగర్‌కు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ ప్రకాష్ గౌడ్.. ఈ జాబితాలో చేరారు. పార్టీ ఫిరాయించారు. రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డితో కలిసి ఆయన రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన చేతుల మీదుగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
అంతకుముందు ఆయన తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తన రాజకీయ గురువుగా అభివర్ణించారు. కాంగ్రెస్‌లో చేరుతున్న విషయాన్ని ధృవీకరించారు. తిరుమల నుంచి హైదరాబాద్‌కు చేరిన వెంటనే ఆయన కాంగ్రెస్‌లో చేరారు.












Click it and Unblock the Notifications