మరో 5రోజులు వదలనని చెప్తున్న వరుణుడు.. ఈ జిల్లాలకు రెయిన్ అలెర్ట్!
తెలంగాణా రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలకి తోడు ఈశాన్య అరేబియా సముద్రం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉండటంతో భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేకచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జులై 9వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.
తెలంగాణాలో వర్షాలు
మొత్తం 15 జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా ఉత్తర తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతాలలోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.

నేడు ఈ జిల్లాలలో మోస్తరు వర్షాలు
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోనూ నేడు కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, కొత్తగూడెం జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
కృష్ణా పరీవాహక ప్రాజెక్ట్ లకు జలకళ
మరోవైపు ఆది సోమవారాలలో కూడా కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా బేసిన్లో వరద ఉధృతి పెరిగింది. కృష్ణా పరివాహక ప్రాంతాలలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి.
శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి
ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలోని నారాయణపూర్, తెలంగాణాలోని జూరాల ప్రాజెక్టులు జలకళతో తొణికిసలాడుతున్నాయి. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా నీరు వచ్చి చేరుతుంది. ఇప్పటికే రెండు విద్యుత్ కేంద్రాలలోనూ విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ఉన్న నీటి ఫ్లో కంటిన్యూ అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు మరొక ఒకటి రెండు రోజుల్లోనే డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది.
ప్రజలు అప్రమత్తం
మొత్తం ఐదు రోజులపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయి అన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వర్షాలు కురిసే జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications