సోషల్ డిస్టెన్స్ పాటించని మరో సూపర్ మార్కెట్ సీజ్
కరోనాపై పోరాటం చేస్తున్న నేపధ్యంలో కేవలం నిత్యావసరాలకు మాత్రమే ప్రజలు బయటకు వచ్చేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి . ఇక నిత్యావసరాలు విక్రయించే దుకాణాల వద్ద కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెప్పినా సరిగా పాటించకపోవటంతో నిన్నటికి నిన్న ఎల్బి నగర్ లోని డిమార్ట్ సూపర్ మార్కెట్ ను అధికారులు సీజ్ చేశారు. సూపర్ మార్కెట్లో సామాజిక దూరం పాటించకుంటే ఇలానే సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నా పట్టించుకోకపోవటంతో తాజాగా మరో సూపర్ మార్కెట్ సీజ్ అయ్యింది .
తాజాగా నేడు మరో సూపర్ మార్కెట్ సీజ్ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. శ్రీనగర్ కాలనీలోని రత్న దీప్ సూపర్ మార్కెట్ ను గురువారం జీహెచ్ఎంసీ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సీజ్ చేశారు. ప్రతినిత్యం రద్దీగా ఉండే రత్నదీప్ సూపర్ మార్కెట్లో యాజమాన్యం సోషల్ డిస్టెన్స్ విషయంలో శ్రద్ధ తీసుకోవటం లేదు . ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన భౌతిక దూరం నిబంధనలను పాటించడం లేదు. ఈ నేపథ్యంలోనే గురువారం ఆ స్టోర్ ని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీ చేశారు.

మార్కెట్ లో ఉన్న ఏ ఒక్క కస్టమర్ కూడా సామాజిక దూరం పాటించకపోవడాన్ని గుర్తించిన అధికారులు సూపర్ మార్కెట్ ను సీజ్ చేశారు . అంతే కాక కస్టమర్ల కోసం శానిటైజర్స్ కూడా యాజమాన్యం ఏర్పాటు చేయలేదని అధికారులు గుర్తించారు. దీంతో వారు మార్కెట్‌ను సీజ్‌చేసి నోటీసులు అంటించారు. సూపర్ మార్కెట్ వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించకపోవటమే అధికారులు ఈ తరహా నిర్ణయాలు తీసుకోవటానికి కారణం అని చెప్పాలి . నిన్నటికి నిన్న డీమార్ట్, ఇక నేడు రత్నదీప్ సూపర్ మార్కెట్ ను అధికారులు సీజ్ చేసి సోషల్ డిస్టెన్స్ పాటించకుంటే చర్యలు తప్పవని పేర్కొన్నారు .












Click it and Unblock the Notifications