గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు, 21న టీడీపీ జెండా పండుగ: లోకేశ్
హైదరాబాద్: వచ్చే నెలలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారం నిర్వహిస్తారని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. మంగళవారం తెలంగాణ టీడీపీ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించారు.
వచ్చే నెలలో గ్రేటర్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఈ నెల 17వ తేదీన గ్రేటర్ డివిజన్ల అధ్యక్షులతో భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే 21వ తేదీన గ్రేటర్ పరిధిలోని అన్ని డివిజన్లలో జెండా పండుగను నిర్వహించాలని తీర్మానించారు.

జీహెచ్ఎంసీ పరిధిలో వంద డివిజన్లను గెలవాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. గ్రేటర్ ఎన్నికల విషయంలో పార్టీ అధ్యక్షులు చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారని తెలిపారు. మిత్రపక్షమైన బీజేపీకి ఎక్కువ డివిజన్లు ఇవ్వొద్దని సూచించారు.
బీజేపీకి ఎన్ని సీట్లు కేటాయించాలనే విషయంపై పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటారని నేతలతో లోకేశ్ పేర్కొన్నారు.
మొదలైన గ్రేటర్ సందడి
గ్రేటర్ ఎన్నికలకు ఏర్పాట్లు అప్పుడే ప్రారంభమయ్యాయి. కుత్బుల్లాపూర్ సర్కిల్ 8 డివిజన్లలో జరిగే ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంలను భద్ర పరిచే విషయంపై ఐడీపీఎల్ కాలనీ స్కూల్‌ను మంగళవారం సికింద్రాబాద్ నార్త్ జోన్ కమిషనర్ హరిచందన దాసరి పరిశీలించారు.
మొత్తం నాలుగు స్ట్రాంగ్ రూంలతో పాటు 8 వార్డులకు ఒకటి చొప్పున కౌంటింగ్ హాల్‌లను గుర్తించారు. ఈఈ పర్యవేక్షణలో స్థానికంగా ఏర్పాట్లు జరగాలని ఆమె ఆదేశించారు. సర్కిల్ పరిధిలో మొత్తం 4,53,100 ఓటర్లు ఉండగా 429 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు ఉప కమిషనర్ గీత రాధిక తెలిపారు.












Click it and Unblock the Notifications