ఎపి డిజిపి మాట: కెటిఆర్ అనుచరులు, గన్‌మెన్‌పై కేసులు సిల్లీ
హైదరాబాద్: విశాఖఫట్నం పోలీసు కమిషరేట్ పరిధిలోని పెందుర్తి పోలీసు స్టేషన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు తనయుడు, మంత్రి కెటి రామారావు గన్‌మన్, అనుచరులపై నమోదైన కేసును సిల్లీ కేసుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి జెవి రాముడు వ్యాఖ్యానించారు. ఓటు నోటు కేసులో నిందితుడు మత్తయ్య తమకు ఫిర్యాదుదారుగానే తెలుసునని అన్నారు.
బుధవారం జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. కెటిఆర్ గన్‌మన్, అనుచరులపై నమోదైన కేసు సిల్లీ కేసు అని, అలాంటి వాటికి సంబంధించిన వివరాలన్నీ తన వద్ద ఉండవని, రోటీన్‌గా నోటీసులు ఇచ్చి ఇంటారని, స్థానిక పోలీసులను అడగండని ఆయన చెప్పారు.
మత్తయ్యకు ఎపి పోలీసులు ఆశ్రయం కల్పించారనే విమర్శలు వస్తున్నాయని మీడియా ప్రతినిదులు అంటే మత్తయ్య ఓ ఫిర్యాదుదారుడిగా మాత్రమే తమకు తెలుసునని, ఓ కేసులో ఫిర్యాదు చేసిన వ్యక్తికి అండగా ఉండాల్సిన బాధ్యత పోలీసులకూ ప్రభుత్వానికీ ఉందని, అందుకు తగినట్లే స్పందించామని ఆయన అన్నారు.

ఎపి సిఐడి దర్యాప్తు చేస్తున్న కేసులు తెలంగాణ ఎసిబి దర్యాప్తు చేస్తున్న ఓటుకు నోటు కేసుకు కౌంటరైనా, నోటీసుల జారీ కూడా వారి చర్యకు ప్రతిచర్యలాగా కనిపిస్తోందని మీడియా ప్రతినిధులు అంటే అలా ఆలోచించాల్సిన అవసరం లేదని, సిఐడి దగ్గర ఉన్న కేసు దర్యాప్తులో భాగంగానే నోటీసుల జారీ ప్రక్రియ జరుగుతోందని, దీనిపై ఎక్కువగా ఆలోచించవద్దని రాముడు అన్నారు.
మీవి కౌంటర్ కేసులని, మీది రియాక్షన్ అని కొందరు మాజీ డిజిపిలు అంటున్నారని మీడియా ప్రతినిధులు గుర్తు చేస్తే రిటైర్ అయినవాళ్లు ఏదైనా మాట్లాడవచ్చునని, వారికి ఎలాంటి క్రమశిక్షణా నియమాలు ఉండవని, అది వాస్తవం కాదని జెవి రాముడు చెప్పారు.
ఎపి, తెలంగాణ పోలీసుల మధ్య విభేదాలున్నాయని, అవి కొనసాగుతున్నాయనే విమర్శలున్నాయని అంటే, తామంతా ఆలిండియా సర్వీస్ అధికారులమని, తమకు దేశ ప్రయోజనాలే తమకు ప్రథమ ప్రాధాన్యమని, దేశం మొత్తానికి ఒకే పోలీసు వ్యవస్థ ఉంటుందని, తెలంగాణ అధికారులతో తాము స్నేహపూర్వకంగా ఉన్నామని, ఎలాంటి అగాధం కూడా లేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications