ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం పర్యావరణ కాలుష్య నివారణకు విశేషంగా కృషి చేస్తుంది. ఏపీని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తయారు చేయడం కోసం కంకణం కట్టుకున్న ఏపీ సర్కార్ కాలుష్య నియంత్రణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే ఆర్టీసీకి ఈ బస్సులను అందించి కాలుష్యాన్ని కొంతమేర నివారించింది. తాజాగా స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర పథకం కింద బ్యాటరీపై నడిచే ఈ సైకిళ్లను రాయితీపై అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
11 వేల రూపాయలు రాయితీతో ఈ సైకిల్స్
ఈ సైకిల్స్ వినియోగంతో పొల్యూషన్ మాత్రమే కాదు, పెట్రోల్ ఖర్చులు కూడా ఆదా అవుతాయని, చార్జింగ్ పెట్టడం ద్వారా ఈ సైకిల్స్ వినియోగించుకోవచ్చని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 11 వేల రూపాయలు రాయితీతో కేవలం 24 వేల రూపాయలకే ఈ సైకిల్స్ ను అందిస్తుందని తెలుస్తోంది.

కుప్పం నియోజకవర్గంలో ఈ సైకిల్స్ పంపిణీ చేసిన చంద్రబాబు
మొత్తం 35 వేల రూపాయలు విలువైన ఈ సైకిల్స్ ను రాయితీ పైన అందిస్తున్న ఏపీ ప్రభుత్వం వీటి కొనుగోలును, వినియోగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు జనవరిలో కుప్పం నియోజకవర్గంలో ఈ సైకిల్స్ పంపిణీని ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా ఉద్యోగులు డ్వాక్రా మహిళలకు ఈ సైకిల్ లను అందజేశారు.
చంద్రబాబు ఈ సైకిల్స్ పంపిణీ ఒక రికార్డు
ముఖ్యమంత్రి స్వయంగా సైకిల్ తొక్కుకుంటూ సభా ప్రాంగణానికి వచ్చి కుప్పంలో ఒకేసారి 5555 సైకిళ్లను పంపిణీ చేసి కొత్త రికార్డును సృష్టించారు. ఈ సైకిల్స్ పలు ఆధునిక ఫీచర్లను కలిగి, గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసేలా రూపొందించబడ్డాయి. మూడు గంటల చార్జింగ్ తో 40కిలోమీటర్ల దూరం వెళ్లేలా తయారు చేయబడ్డాయి. డిజిటల్ మీటర్ ద్వారా బ్యాటరీ చార్జింగ్, వేగం, ప్రయాణం చేసిన దూరం వంటి వివరాలను తెలుసుకోవచ్చు.
బ్యాటరీ సైకిల్స్ కు బ్యాంకుల్లో లోన్స్ అందుబాటులో
బ్యాటరీని సైకిల్ నుంచి తీసి ఇంట్లో ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ బ్యాటరీ చార్జింగ్ అయిపోతే దానిని మామూలు సైకిల్ లా కూడా తొక్కవచ్చు. ఇక ఈ సైకిల్ కొనుక్కోవాలి అనుకునే వారు ముందుగా 5000 రూపాయలను చెల్లించాలి. మిగిలిన మొత్తానికి బ్యాంకుల్లో లోన్స్ అందుబాటులో ఉంటాయి. దీనిని 24 నెలలు సులభ వాయిదాలలో తిరిగి చెల్లించవచ్చు. ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వారు తమ సమీపంలో ఉన్న గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో లేదా జిల్లాలోని డిఆర్డిఏ అధికారులను సంప్రదించి దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications