సరస్వతీ పుష్కరాలకు ప్రత్యేక బస్సులు - రూట్లు, ప్యాకేజీ, షెడ్యూల్..!!
సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో మొదలైన ఈ పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఈ నెల 26వ తేదీ వరకు ఈ పుష్కరాలు కొనసాగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం ఏపీ, తెలంగాణ ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసాయి. ప్యాకేజీలు ప్రకటించాయి.
తెలంగాణలో సరస్వతీ పుష్కరాలు ప్రారంభమయ్యాయి. మే15వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు పన్నెండు రోజుల పాటు ఈ పుష్కరాలు జరుగనున్నాయి. రోజుకూ 40 నుంచి 50 వేల మంది భక్తులు పుష్కరాలకు వస్తారని అంచనా వేశారు. పుష్కరాల కోసం రూ. 35 కోట్లతో రేవంత్ ప్రభుత్వం ఏర్పాట్లను చేపట్టింది. తెలంగాణ ఆర్టీసీ 33 జిల్లాల నుంచి 220 ప్రత్యేక బస్సులను నడుపనుంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పుష్కరాలకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. అదే విధంగా ఏపీఎస్ఆర్టీసీ సైతం ఈ పుష్కరాల కోసం ప్రత్యేక బస్సులను ప్రకటించింది. ప్యాకేజీలను ఖరారు చేసింది.

కాళేశ్వరం, త్రివేణి సంగమ యాత్రకు విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. కాగా, సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ.1999, ఇంద్ర ఏసీ బస్సులో రూ.2599 టికెట్ ధరగా నిర్ణయించారు. ఇవి బస్సు ఛార్జీలు మాత్రమేనని, భోజనం, ఇతర వసతులు భక్తులే చూసుకోవాలన్నారు. భక్తులు తమ సీట్లను ఆన్‌లైన్‌లో (apsrtconline.in), సమీప బస్‌స్టేషన్‌లో ఆర్టీసీ అధీకృత టికెట్ బుకింగ్ ఏజెంట్ల వద్ద బుక్ చేసుకోవచ్చు. ఈ బస్సులు 16న రాత్రి 10 గంటలకు పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో బయలుదేరి ఖమ్మం, వరంగల్, భూపాలపల్లి మీదుగా మరుసటి రోజు ఉదయం 5 గంటలకు కాళేశ్వరం చేరుకుంటాయి.
భక్తులు పుష్కర స్నానం చేశాక, ముక్తేశ్వర స్వామి దర్శనం అనంతరం ధర్మపురిలోని లక్ష్మీనర సింహస్వామి, కొండగట్టు ఆంజనేయస్వామి, వేములవాడ రాజన్న ఆలయాలను దర్శించుకొని రాత్రి అక్కడే బస చేయాలి. మూడో రోజు ఉదయం వరంగల్‌లోని భద్రకాళి దేవాలయం, వేయి స్తంభాల గుడి, రామప్ప ఆలయ సందర్శన తర్వాత నాలుగో రోజు ఉదయం విజయవాడకు చేరు కుంటాయి. వివరాలకు 80742 98487, 93903 98475 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.












Click it and Unblock the Notifications