అగ్నిపథ్ అల్లర్ల కీలక సూత్రధారి అరెస్ట్?
అగ్నిపథ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన విధ్వంసం వెనక కీలక సూత్రధారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ అల్లర్లను, విధ్వంసాన్ని ప్రోత్సహించాడనే అభియోగంపై ఆవుల సుబ్బారావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని నరసరావుపేటకు తరలిస్తున్నారు. నరసరావుపేటలో ఉన్న సాయి డిఫెన్స్ అకాడమీలో ఆయన డైరెక్టర్ గా ఉన్నారు. ప్రకాశం జిల్లా కంభంలో సుబ్బారావును అరెస్ట్ చేశారు. అల్లర్లలో ఆయన పాత్ర ఉందన్న అనుమానంతో ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అల్లర్లు, విధ్వంసానికి సంబంధించి ఇప్పటివరకు 30 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 12 మంది ప్రధాన సూత్రధారులని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్మీ ఉద్యోగాలపై ఆశతో ఉన్న కొందరు అభ్యర్థులను కూడా రెచ్చగొట్టినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బ్లాక్స్, 17/ 6 గ్రూప్, హకీంపేట ఆర్మీ సోల్జర్స్ పేరుతో రెండు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ అల్లర్లకు సంబంధించిన వాట్సాప్ సందేశాలు వైరలయ్యాయి. వీరిలో కొందరు అభ్యర్థులతో సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావు దిగిన ఫొటోలు వైరలవుతున్నాయి. అంతేకాకుండా కరీంనగర్ కు చెందిదిన స్టార్ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు వసీంపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అల్లర్లలో ఆయన పాత్రపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. మిగిలిన సూత్రధారులను కూడా అతిత్వరలోనే అరెస్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications