ఒవైసీ కోరారు.. జగన్ అంగీకరిస్తారా?
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించిన యూనిఫామ్ సివిల్ కోడ్.. రాజకీయ వేడి పుట్టిస్తోంది. ముస్లిం సంఘాలు, ముస్లిం పర్సనల్ లా బోర్డ్, మైనారిటీ అసోసియేషన్లు దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తోన్నాయి. అఖిల భారత మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్.. ఈ ప్రతిపాదనలపై ఏకంగా వ్యతిరేక ఉద్యమాన్నే మొదలు పెట్టింది.
ఇందులో భాగంగా.. ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ- కొద్దిసేపటి కిందటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోయే యూసీసీ బిల్లును అడ్డుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇది ముస్లింలకు సంబంధించిన సమస్యే కాదని.. క్రైస్తవులు కూడా ఈ బిల్లు వల్ల అనేక ఇబ్బందులకు గురవుతారనే ఆందోళన వ్యక్తం చేశారు.

యూసీసీ బిల్లు కార్యరూపాన్ని దాల్చితే.. దేశంలో సాంస్కృతిక భిన్నత్వం మటుమాయమౌతుందని ఒవైసీ అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనేది దేశ మూల సిద్ధాంతమని, అది ధ్వంసమౌతుందని పేర్కొన్నారు. ఇది మంచిది కాదని అభిప్రాయపడ్డారు. దీనిపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. పార్లమెంట్‌లో యూసీసీని వ్యతిరేకిస్తామని హామీ ఇచ్చారు.
సమావేశం ముగిసిన అనంతరం ఒవైసీ.. విలేకరులతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఘాటు విమర్శలు చేశారు. బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. మోదీ-బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌లకు దేశ సంస్కృతి సంప్రదాయాలు, బహుళత్వం అంటే ఏ మాత్రం ఇష్టం లేదని, దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తోన్నారని విమర్శించారు.
యూసీసీ బిల్లును పార్లమెంట్‌లో వ్యతిరేకిస్తామంటూ కేసీఆర్ హామీ ఇచ్చారని ఒవైసీ తెలిపారు. దీన్ని వ్యతిరేకించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి కూడా విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. యూసీసీ బిల్లు పార్లమెంట్ సమక్షానికి వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్ట వ్యతిరేకిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు.












Click it and Unblock the Notifications