అశ్విన్ రావ్ కు హైకోర్టులో షరతులతో జామీను
బెంగళూరు: కర్ణాటక లోకాయుక్తలో జరిగిన అవినీతి కేసుకు సంబంధించి హైదరాబాద్ కు చెందిన అశ్విన్ రావ్ (హైదరాబాద్) కు కర్ణాటక హైకోర్టు షరతులతో జామీను మంజూరు చేసింది. నియమాలు ఉల్లంఘిస్తే జామీను రద్దు చేస్తామని న్యాయస్థానం హెచ్చరించింది.
కర్ణాటక లోకాయుక్త మాజీ న్యాయమూర్తి భాస్కర్ రావ్ (హైదరాబాద్) కుమారుడు అశ్విన్ రావ్ తో పాటు, కర్ణాటక లోకాయుక్త పీఆర్ఓ (మాజీ) సయ్యద్ రియాజ్, భాస్కర్ తో పాటు ఈ కేసులోని అందరికి కర్ణాటక హైకోర్టు సోమవారం షరతులతో జామీను ఇచ్చింది.
బెంగళూరు నగర జిల్లా పంచాయితి సీనియర్ ఇంజనీరు క్రిష్ణమూర్తి, హావేరీ జిల్లా సీనియర్ ఇంజనీరు చెన్నబసప్పలను లంచం ఇవ్వాలని లేదంటే, లోకాయుక్తతో దాడి చేయిస్తామని బెదిరించారని వెలుగు చూసింది.

సీనియర్ ఇంజనీర్లు క్రిష్ణమూర్తి, చెన్నబసప్ప ఫిర్యాదు మేరకు అశ్విన్ రావ్ తదితరుల మీద కేసు నమోదు చేసిన ప్రత్యేక బృందం పోలీసులు (సిట్) దర్యాప్తు చేసి 2015 ఆగస్టు నెలలో హైదరాబాద్ లో అశ్విన్ రావ్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు.
అప్పటి నుంచి అశ్విన్ రావ్ తదితరులు బెయిల్ ఇవ్వాలని కోర్టులో అర్జీలు సమర్పిస్తున్నారు. అయితే వీరికి జామీను మంజూరు చేస్తే సాక్షులను బెదిరిస్తారని, జామీను మంజూరు చెయ్యరాదని సిట్ అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
అప్పటి నుంచి బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార జైల్లో ఉన్న అశ్విన్ రావ్ తదితరులకు సోమవారం కర్ణాటక హై కోర్టు ఒక్కోక్కరికి రూ. ఒక లక్ష బాండ్ ల పూచీకత్తుతో షరతులతో జామీను మంజూరు చేసింది.
అదే విధంగా అందరూ వారి పాస్ పోర్టులు సిట్ అధికారులకు అప్పగించాలని, విచారణకు పిలిచినప్పుడు అధికారుల ముందు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications