మునుగోడు ఉపఎన్నికలో ఓటుకు 40వేలు; కేసీఆర్ అధికార దుర్వినియోగం: విరుచుకుపడిన బండి సంజయ్
మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల కావడం, నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కావడంతో మునుగోడు ఉపఎన్నిక బరిలో రాజకీయ పార్టీలు దూకుడు చూపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ, టిఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపణలు చేస్తోంది. మునుగోడులో ధన ప్రవాహం కొనసాగుతుందని విమర్శలు గుప్పిస్తోంది. ప్రజలను ప్రలోభాలకు గురి చేసి తమ వైపు తిప్పుకోవాలని టిఆర్ఎస్ పార్టీ నాయకులు శతవిధాల ప్రయత్నిస్తున్నారని విమర్శలు చేస్తోంది.

మునుగోడు ఓటర్లకు ఓటుకు 40 వేలు పంచేందుకు రెడీ అయిన టీఆర్ఎస్: బండి సంజయ్
ఇక తాజాగా మునుగోడు ఉప ఎన్నికపై, టిఆర్ఎస్ పార్టీ వ్యవహారశైలిపై మండిపడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మునుగోడు ఉపఎన్నికలో ఓటుకు రూ.40 వేలు పంచేందుకు టీఆర్ఎస్ సిద్ధమైందని ఆరోపణలు చేశారు. పోలీస్, అధికార యంత్రాంగాన్ని కెసిఆర్ దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఇక రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ సొంత నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులను పక్కనపెట్టి తాగి తందనాలు ఆడడానికి మునుగోడులో మకాం పెట్టారని బండి సంజయ్ విమర్శించారు.

ఫోన్లు ట్యాప్ చేసేందుకు ఒప్పందాలు చేసుకుంది కేసీఆరే
ఇక తాజాగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేసిన బండి సంజయ్ అటువంటి నీచ బుద్ధి కేసీఆర్ కే ఉందని విమర్శించారు. ఫోన్లు ట్యాప్ చేయడం కోసం ఇజ్రాయిల్ టెక్నాలజీ తో ఒప్పందం చేసుకుంది కేసీఆర్ అని పేర్కొన్న బండి సంజయ్, ఇక ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రులు, ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారని టార్గెట్ చేశారు. బిజెపిపై విమర్శలు చేయడానికి సిగ్గు ఉండాలని మండిపడిన బండి సంజయ్ అవినీతి, అక్రమాలకు పాల్పడి, ఇప్పుడు ఫోన్ ట్యాప్ చేస్తున్నారని కొత్త పాట పాడుతున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ తో కలిసి టీఆర్ఎస్ కుట్రలు
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం కోసం టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కలిసి కుట్ర పన్నాయని బండి సంజయ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కాంగ్రెస్ అభ్యర్థికి ఆర్థిక సహాయం చేస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. మునుగోడు నియోజకవర్గంలో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా బిజెపి భారీ మెజార్టీతో గెలవడం ఖాయం అని చెప్పిన బండి సంజయ్, మందు, విందు, మంది, మంత్రులతో మునుగోడు ఓటర్ల తీర్పును మార్చలేరని స్పష్టం చేశారు. టిఆర్ఎస్ పార్టీ ఓటుకు 40,000 ఇచ్చినా మునుగోడు ఓటర్లు బిజెపినే ఆదరిస్తారని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications