వదిలిపెట్టం.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం; ఢిల్లీ వెళ్ళినా ఏమీ చెయ్యలేరు: బండి సంజయ్
మునుగోడు ఉప ఎన్నికల వేళ టిఆర్ఎస్ పార్టీ, బిజెపిపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని బండి సంజయ్ విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బిజెపి ప్రమేయం ఉందన్న వార్తలను కొట్టి పారేసిన ఆయన , ఈరోజు యాదాద్రి కి వెళ్లి నరసింహ స్వామి సాక్షిగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ప్రమాణం చేస్తానని, సీఎం కేసీఆర్ కూడా దమ్ముంటే యాదాద్రికి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఇక యాదాద్రి కి బయలుదేరడానికి ముందు మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ టిఆర్ఎస్ తీరు పై నిప్పులు చెరిగారు.

ఢిల్లీ వెళ్ళినా వాళ్ళు అనుకున్నది జరగదు : బండి సంజయ్
ఉప ఎన్నికల వేళ మునుగోడులో ఏదో చేయాలనుకున్నారు. అది సాధ్యం కాలేదు అన్న బండి సంజయ్, ఇక హైదరాబాద్ కేంద్రంగా ఇంకా ఏదో చేద్దామని ప్రయత్నించారు కానీ ఈ రెండు సందర్భాలలో వాళ్లు అనుకున్నది జరగలేదని పేర్కొన్నారు. ఇక ఇప్పుడు ఢిల్లీ అంటున్నారని, ఢిల్లీ వెళ్లిన వాళ్లు చేయగలిగేది ఏమీ లేదంటూ బండి సంజయ్ తేల్చి చెప్పారు.

ఆ డబ్బెక్కడ? బీజేపీ ప్రమేయం ఏమిటో? పోలీస్ కమీషనర్ వెల్లడించాలి
ఎవరో ఎమ్మెల్యేలను కొనాలని చూశారు. డబ్బు కూడా దొరికిందని ప్రచారం చేస్తున్నారని, ఇక అయితే ఆ డబ్బు ఎక్కడ ఉందో చూపించాలని బండి సంజయ్ ప్రశ్నించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బు ఎక్కడుందో చెప్పాలని, ఎలాంటి కుట్ర జరిగిందో, ఆ కుట్రలో బీజేపి ప్రమేయం ఏమిటో పోలీస్ కమిషనర్ వెల్లడించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఏ నేతలకు ఇందులో ప్రమేయం ఉందో చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు.

ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం
ఈ విషయంలో తాము ఎవరినీ వదిలిపెట్టేది లేదని పేర్కొన్న బండి సంజయ్, న్యాయ వ్యవస్థ మీద తమకు నమ్మకం ఉంది కాబట్టి తమ కోర్టును ఆశ్రయించామని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇక ఎమ్మెల్యేలు కొనుగోలుకు సంబంధించి కొనసాగుతున్న ఈ వ్యవహారం ఉప ఎన్నిక తో ముడిపడి ఉన్న కారణంగా తాము కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని వెల్లడించారు.

ఏదో దొంగాదారిలో ప్లాన్.. అనుకున్నది జరగక చతికిలబడిన టీఆర్ఎస్
మునుగోడు ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో టిఆర్ఎస్ గెలవదని , అందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారని బండి సంజయ్ కి స్పష్టం చేశారు. అన్ని సర్వేలు బీజేపీకి అనుకూలంగా రావడంతో ఏదో దొంగదారి వెతుకుతున్నారని, అదికూడా అనుకున్నట్టు జరగక పోయేసరికి చతికిలబడ్డారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ ఏం చేస్తారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, ఇవన్నీ చూసిన తర్వాత అయినా సీఎం మునుగోడు పోటీ నుంచి తప్పుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications