మిగతా పోస్టుల నోటిఫికేషన్ ఎప్పుడు? కేసీఆర్ కు బహిరంగ లేఖలో బండి సంజయ్ డిమాండ్లు
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. తాజాగా పోలీసు శాఖలోని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో, మిగతా పోస్టులకు నోటిఫికేషన్ ఎప్పుడు జారీ చేస్తారంటూ బండి సంజయ్ బహిరంగ లేఖలో ప్రశ్నించారు.

కేవలం పోలీస్ శాఖలో పోస్టుల భర్తీ.. మిగతా పోస్టుల మాటేమిటి?
ఎనిమిదేళ్ల టిఆర్ఎస్ పాలనలో కేవలం పోలీసు పోస్టులు భర్తీ చేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. పోలీస్ శాఖలో కాకుండా మిగతా 63,425 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారని బండి సంజయ్ లేఖలో ప్రశ్నించారు. నియంత పాలనకు అడ్డు రాకూడదని తెలంగాణా సర్కార్ పోలీస్ పోస్టులు భర్తీ చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఇతర శాఖల్లో ఖాళీల భర్తీ విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని పేర్కొన్నారు బండి సంజయ్. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బహిరంగ లేఖలో బండి సంజయ్ డిమాండ్లు
ఎన్నికల హామీ మేరకు మూడున్నరేళ్లలో ఒక్కో నిరుద్యోగికి 1.20లక్షల భృతి చెల్లించాలని బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని పేర్కొన్న బండి సంజయ్ నియోజకవర్గ కేంద్రాలలో ప్రభుత్వ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాలయాపన చేయకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలని పేర్కొన్న బండి సంజయ్, కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరించాలని,విధుల నుంచి తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్ లను తిరిగి తీసుకోవాలని లేఖలో స్పష్టం చేశారు.

ఉద్యోగాల భర్తీ విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వ తీరు నీటిమీద రాతలు
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన కెసిఆర్ తక్షణం ఖాళీగా ఉన్న అన్ని పోస్టుల భర్తీకి త్వరితగతిన నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీ విషయంలో తాను నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ పాదయాత్రలో అనేక చోట్ల నిరుద్యోగ యువత పోస్టుల భర్తీలో ప్రభుత్వ జాప్యంపై తన దృష్టికి తీసుకువచ్చారని పేర్కొన్న బండి సంజయ్ ఉద్యోగాల భర్తీ విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వ తీరు నీటిమీద రాతలుగా మిగిలిపోతున్నాయని మండిపడ్డారు.

నోటిఫికేషన్లు ఇవ్వకుండా తాత్సారం దేనికి?
మార్చి 7 న నిర్వహించిన వనపర్తి బహిరంగ సభలో సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు ప్రభుత్వం వైపు నుండి తీపి వార్త చెప్తామని , మార్చి 8వ తేదీ ఉదయం 10 గంటలకు టీవీ చూడాలని ఆర్భాటం చేశారని బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం ప్రభుత్వ శాఖల్లో ఒక లక్ష 91 వేల పోస్టులు ఖాళీగా ఉంటే కెసిఆర్ 80,039 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు అని బండి సంజయ్ పేర్కొన్నారు. కెసిఆర్ చేసిన ప్రకటన లక్షలాది మంది నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురి చేసిందని బండి సంజయ్ వెల్లడించారు. ఇదిలా ఉంటే నోటిఫికేషన్లు ఇవ్వకుండా తాత్సారం చెయ్యటం దేనికని ప్రశ్నించారు. తక్షణం మిగతా పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వాలని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications