కొత్త సచివాలయం డోములు కూల్చేస్తాం: కారణం చెప్పి.. బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు
తెలంగాణా నూతన సచివాలయం డోమ్ లు కూల్చేస్తామని బండి సంజయ్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నేతల కూల్చివేతల మాటలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికరంగా మారుతున్నాయి.ఇటీవల టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ను నక్సలైట్లు పేల్చివేయాలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు మరచిపోక ముందే, తెలంగాణ రాష్ట్రానికి నూతనంగా నిర్మించిన కొత్త సచివాలయ డోమ్ లు కూల్చివేస్తామంటూ బండి సంజయ్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

కొత్త సచివాలయంపై బండి సంజయ్ సంచలనం
రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త సచివాలయం డోములు కూల్చివేస్తామంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. తాజ్ మహల్ తరహాలో ఉన్న ఆ డోములు తెలంగాణ సంస్కృతికి భిన్నంగా ఉన్నాయని వాటిని కూల్చి, తెలంగాణ సంస్కృతికి అనుగుణంగా మళ్లీ మార్పులు చేర్పులు చేస్తామని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ బిజెపి రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ లో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గం బోయినపల్లి చౌరస్తాలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కు హాజరైన బండి సంజయ్ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజ్ మహల్ తరహాలో సచివాలయం.. ఓవైసీ కళ్ళలో ఆనందం కోసమే
తాజ్ మహల్ కంటే అద్భుతంగా సచివాలయాన్ని కేసీఆర్ నేర్పించారని ఓవైసీ అంటున్నాడని పేర్కొన్న బండి సంజయ్, అసదుద్దీన్ ఓవైసీ కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే కెసిఆర్ తాజ్ మహల్ నమూనాలో కొత్త సచివాలయాన్ని నిర్మించారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ సంస్కృతిని తుంగలో తొక్కుతూ నిర్మించిన తాజ్ మహల్ నమూనా డోమ్ లను తాము అధికారంలోకి వస్తే కూల్చివేస్తామని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు మంత్రి కేటీఆర్ రోడ్డు పక్కన ఉన్న గుళ్ళు, మసీదులు కూల్చుతామని చెబుతున్నారని ఆయనకు దమ్ముంటే ముందు ఆ కూల్చివేతలను ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టాలని బండి సంజయ్ సవాల్ విసిరారు.

తెలంగాణ ప్రజలను పట్టించుకునే పరిస్థితిలో కేసీఆర్ లేడు
ఎంఐఎం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటేనని పేర్కొన్న బండి సంజయ్ వారిని సంతృప్తి పరచడం కోసమే కొత్త సచివాలయాన్ని ఆ విధంగా నిర్మించారని అభిప్రాయం వ్యక్తం చేశారు. 15 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా 11 వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లను నిర్వహిస్తున్నట్టు బండి సంజయ్ వెల్లడించారు. కెసిఆర్ అవినీతిని, కుటుంబ పాలనను ప్రజలలోకి తీసుకువెళతామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలను పట్టించుకునే పరిస్థితిలో కేసీఆర్ లేడని విమర్శలు చేసిన బండి సంజయ్ ఎవరైనా ప్రశ్నిస్తే జైల్లో పెడుతున్నారు అంటూ ధ్వజమెత్తారు.

కేసీఆర్ వి అన్నీ మోసాలే
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు ఇవ్వడం లేదని, నిరుద్యోగుల సమస్యలను పట్టించుకునే నాధుడే లేడని, నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వలేదని అసత్య ప్రచారాలు చేస్తూ, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి చేసుకుంటున్నారు అంటూ బండి సంజయ్ విమర్శించారు. 60 శాతం రెవెన్యూ ఇచ్చే హైదరాబాద్ ను ముఖ్యమంత్రి ఏం అభివృద్ధి చేశాడో సమాధానం చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు.

కేసీఆర్ తెలంగాణాలో ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చారో చెప్పాలి
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి.. కెసిఆర్ ఇచ్చిన హామీలలో ఏ హామీలు నెరవేర్చారో చెప్పాలని బండి సంజయ్ నిలదీశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను, కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న సహాయాన్ని ప్రజలకు తెలియజేసి బిజెపికి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తామని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications