మత ఘర్షణలు సృష్టించేది కేసీఆరే: ఆ కార్యక్రమంలో ప్రధానిపై విమర్శలా అంటూ బండి సంజయ్
కరీంనగర్: రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించి.. ఆ నెపాన్ని బీజేపీపైకి నెట్టే ప్రయత్నం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో సీఎం కేసీఆర్ రాజకీయ విమర్శలు ఎలా చేస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు.
Recommended Video

అధికారిక కార్యక్రమంలో ప్రధానిపై విమర్శలా?: కేసీఆర్ బండి ఫైర్
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. అధికారిక కార్యక్రమంలో సీఎం కేసీఆర్.. కేంద్రం, ప్రధానిపై రాజకీయ విమర్శలు చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడటం మానుకోవాలని హితవు పలికారు.
కేసీఆర్ అభివృద్ధి చేశానని అనుకుంటే.. ఏ జిల్లాకు పోతే అక్కడ ఏం చేశారో సీఎం చెప్పాలన్నారు. ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చారో శ్వేతపత్రం విడుల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ నీళ్లు పంపిస్తే.. సీఎం కేసీఆర్ కు తాగే దమ్ముందా? అని సవాల్ విసిరారు. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చింది కేసీఆరేనని మండిపడ్డారు.

సీఎం కేసీఆర్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్న బండి సంజయ్
తాము అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే.. సీఎం కేసీఆర్ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించి...ఆ నెపాన్ని బీజేపీపైకి నెట్టే ప్రయత్నం కేసీఆర్, ఆయన కుటుంబం, టీఆర్ఎస్ చేస్తుందని బండి సంజయ్ అరోపించారు. దేశంలోని 19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని.. ఆయా రాష్ట్రాల్లో ఎక్కడా ఘర్షణలు జరగలేదన్నారు.

కుట్రలో భాగంగానే మునావర్ ఫారూఖీని రప్పించారన్న బండి సంజయ్
తెలంగాణలో వాతావరణం పూర్తిగా మారిపోవడానికి.. హైదరాబాద్ లో గొడవకు కారణం ఎవరో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు.ప్రజల దృష్టిని మళ్లించేందుకు పక్కా ప్లాన్ ప్రకారమే కమెడియన్ మునావర్ ఫారుఖీని హైదరాబాద్ రప్పించారని తెలిపారు. ట్రిపుల్ తలాక్, ఆయోధ్యపై తీర్పు, ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు దేశంలో ఎక్కడా మత ఘర్షణలు జరగలేదన్నారు. అభివృద్ధిపై ముఖ్యమంత్రి చర్చకు సిద్ధమా అంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు. తాము అభివృద్ధి గురించి మాట్లాడితే కేసీఆర్ మతం గురించి మాట్లాడుతున్నారన్నారు.
బీజేపీ వస్తున్న ఆదరణ చూసే అంటూ బండి సంజయ్ ఫైర్
తన పాదయాత్రను అడ్డుకోవడానికి దొంగ కేసులు పెట్టారని బండి సంజయ్ మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవాలని ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా కోర్టులో న్యాయం జరిగిందన్నారు. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు. దళిత బంధు టీఆర్ఎస్ కార్యకర్తలకు తప్ప ఎవ్వరికీ ఇవ్వలేదని బండి సంజయ్ అన్నారు.
ప్రజల్లో బీజేపీకి వస్తున్న ఆదరణను చూసే ప్రజా సంగ్రాయాత్రను అడ్డుకోవడానికి దొంగ కేసులు పెట్టారని మండిపడ్డారు. కావాలనే దాడులు చేయించి అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. దళితబంధు ఎంత మందికి ఇచ్చారో సమాధానం చెప్పాలన్నారు. ఏళ్లు గడుస్తున్నా పోడు భూముల సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని బండి సంజయ్ ప్రశ్నించారు.

కేసీఆర్ వల్లే దక్షిణ తెలంగాణ ఎడారిగా..: బండి సంజయ్
పాలమూరు రంగారెడ్డి పూర్తి కాకపోవడానికి కారణం ఎవరో సీఎం కేసీఆర్ వివరణ ఇవ్వాలన్నారు బండి సంజయ్. ముఖ్యమంత్రి ఏం అభివద్ధి చేశారో ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రతి పథకానికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో స్పష్టంగా చెబుతామన్నారు. మూసీ ప్రక్షాళన... కృష్ణా జలాల వాటా ఏమైందని నిలదీశారు. 575 టీఎంసీలు కృష్ణ జలాలు రావాల్సి ఉండగా.. అప్పటి సీఎంతో కుమ్మక్కై.. 299 టీఎంసీలకు అగ్రిమెంట్‌పై సంతకం చేశారని తెలిపారు.
ఇప్పుడు సీఎం తమకు 575 టీఎంసీలు రావాలని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 575 టీఎంసీలపై ఎందుకు ఫైట్ చేయడం లేదని బండి సంజయ్ నిలదీశారు. రాష్ట్రానికి కేటాయించిన 299 టీఎంసీలైనా ఎందుకు వాడుకోవడం లేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కారణంగానే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారిందని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications