విలీన వజ్రోత్సవాలంటూ మరో జమ్మిక్కు సిగ్గుచేటు; కేసీఆర్.. నిఖార్సైన తెలంగాణావాదివేనా: బండి సంజయ్ ఫైర్!!
తెలంగాణ రాష్ట్రంలో విమోచనా దినమా, విలీన దినమా అంటూ రసవత్తర రాజకీయం చోటుచేసుకుంది. సెప్టెంబర్ 17 న తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంటే, తెలంగాణ విలీన వజ్రోత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రెండు పార్టీల మధ్య రాజకీయ రగడకు కారణమైంది. ఇక తాజాగా ఈ వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కెసీఆర్ తెలంగాణా విమోచనా దినోత్సవం నిర్వహించంది అందుకే
ఎంఐఎం కు భయపడి కెసిఆర్ తెలంగాణ విమోచన దినం నిర్వహించడం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా కెసిఆర్ సిగ్గులేకుండా ప్రవర్తిస్తున్నారన్నారు. తెలంగాణ అమరవీరులను ఘోరంగా అవమానిస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాకముందు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్, సీఎం పీఠం ఎక్కిన తర్వాత ఆ అవసరమే లేదని మాట తప్పడం దుర్మార్గమంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణా విలీన వజ్రోత్సవాల పేరిట కేసీఆర్ మరో ప్లాన్
తెలంగాణ విలీన వజ్రోత్సవాలు పేరిట మరో జిమ్మిక్కుకు కెసిఆర్ ప్లాన్ చేస్తున్నారని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. విమోచన దినం కోసం రాజీలేని పోరాటం చేస్తున్న పార్టీ బిజెపి మాత్రమేనని స్పష్టం చేసిన ఆయన, బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతియేటా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నిఖార్సయిన తెలంగాణ వాది అయితే తక్షణమే విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

కేసీఆర్ విమోచనా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవటం వెనుక ఉన్న కారణం ఏంటి?
అసలు సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం వెనుక అసలు కారణం ఏమిటో ప్రజలకు చెప్పాలని బండి సంజయ్ నిలదీశారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించి తీరాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి తీసుకున్న చొరవని స్వాగతిస్తున్నామని బండి సంజయ్ పేర్కొన్నారు.

తెలంగాణా విమోచనా దినోత్సవం నిర్వహించటానికి కేంద్రం నిర్ణయం
సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థాన విమోచన దినోత్సవాన్ని సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించాలని తీసుకున్న నిర్ణయంపై బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహించాలని బండి సంజయ్ హితవుపలికారు. ఇక తాజాగా తెలంగాణా రాష్ట్రంలో తెలంగాణా విమోచనా దినోత్సవంపై అధికార, ప్రతిపక్ష పార్టీల రాజకీయాలు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications