వరుస ప్రశ్నాపత్రాల లీకేజీతో కేసీఆర్ పై బండి సంజయ్ ఘాటువ్యాఖ్యలు; రాజీనామా డిమాండ్!!
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ దుమారం కొనసాగుతుండగానే, పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపుతుంది. నిన్న వికారాబాద్ తాండూరులో పదవ తరగతి ప్రశ్నాపత్రం తెలుగు పేపర్ లీక్ కాగా, నేడు వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ లీక్ అయిన ఘటన చోటుచేసుకుంది. దీంతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్ ను, తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
ఈనెల 8వ తేదీన తెలంగాణాలో ప్రధాని పర్యటన సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాట్లను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ తో పాటు పార్టీలోని ఇతర నేతలతో కలిసి పర్యవేక్షించిన బండి సంజయ్ అనంతరం మీడియాతో మాట్లాడారు.
ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇప్పటివరకు కేసీఆర్ పేపర్ల లీకేజ్ పై మాట్లాడడం లేదని సమస్య వచ్చినప్పుడు మౌనంగా ఉండడం కోసమేనా ఆయనను ముఖ్యమంత్రిని చేసింది అంటూ బండి సంజయ్ నిలదీశారు.

బీఆర్ఎస్ నాయకులు డబ్బుల కోసం పేపర్లు లీక్ చేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. తప్పు చేయలేదని చెబుతున్న బిఆర్ఎస్ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసును సిట్టింగ్ విచారణ జరిపించడానికి ఎందుకు వెనకాడుతుందో చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. అంతేకాదు దేశంలో బిజెపిని ఓడించడం కోసం అవసరమైతే ఇతర పార్టీల ప్రచార ఖర్చులు కూడా పెట్టుకునేంత డబ్బు కేసీఆర్ దగ్గరకు ఎలా వచ్చిందో చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు.
దేశంలోనే కాదు ప్రపంచంలోనే అన్ని పార్టీలకు కేసీఆర్ నాయకుడు అవుతాడని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ అంటేనే అంతర్జాతీయ దొంగల ముఠా అని పేర్కొన్న బండి సంజయ్ బి అంటే బీర్, ఆర్ అంటే రమ్ము, ఎస్ అంటే స్కాచ్ అంటూ బిఆర్ఎస్ పార్టీకి కొత్త కొత్త అర్థం చెప్పారు.
తెలంగాణ రాకముందు కేసీఆర్ కేటీఆర్ ఎలా ఉన్నారని, ఇప్పుడు వారు ఎలా ఉన్నారని ప్రశ్నించారు. లక్షల కోట్ల డబ్బు కేసీఆర్ కు, కేటీఆర్ కు ఎలా వచ్చాయో చెప్పాలని బండి సంజయ్ నిలదీశారు. మోడీ సర్టిఫికెట్ల గురించి రాద్ధాంతం చేస్తున్న కేసీఆర్ కూతురు కవిత, కేటీఆర్ లు కెసిఆర్ కు సంబంధించిన ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ సర్టిఫికెట్ బయట పెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
వీళ్ళ చదువులు డ్రగ్స్, లిక్కర్, కమిషన్ దందాలకు ఉపయోగపడ్డాయని మంత్రి కేటీఆర్ ను, కవితను టార్గెట్ చేశారు బండి సంజయ్. అంతేకాదు త్వరలో వరంగల్ లో నిరుద్యోగ మార్చ్ నిర్వహించనున్నట్టు బండి సంజయ్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications