కేసీఆర్ గజనీ వేషాలు మానుకో .. తాటాకు చప్పుళ్ళకు భయపడం: బండి సంజయ్ వార్నింగ్ !!
తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు పై అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయ రగడ కొనసాగుతోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పుడు క్షేత్ర స్థాయిలో రంగంలోకి దిగిన బండి సంజయ్ తెలంగాణ సర్కారుపై ఒత్తిడి తీసుకురావడమే కాకుండా, తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నారు. క్షేత్ర స్థాయిలో బండి సంజయ్ పర్యటనలతో ఇప్పుడు మరింత రాజకీయ వేడి రగులుకుంది.

సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్
తాజాగా సోమవారం నాడు నల్గొండ జిల్లాలో క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను పరిశీలించేందుకు వెళ్లిన బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై ద్వజమెత్తారు. నల్గొండలోని ఆర్జాల బావి ఐకెపి కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు విషయం లో రైతులకు తలెత్తుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. యాసంగి వరి సాగు చేసినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని, కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తుందని రైతులకు బండి సంజయ్ కేంద్రం తరపున రైతులకు భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు .
ఇప్పటికైనా గజనీ వేషాలు మానుకోవాలని హితవు
కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొంటే చాలు ముఖ్యమంత్రి గారు అంటూ సంబోధించిన బండి సంజయ్, గతంలో ప్రతి గింజ తానే కొంటానని చెప్పిన సీఎం కెసిఆర్ ఇప్పుడు మాట మారుస్తున్నారు అంటూ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ సమస్యలు పరిష్కరించకుండా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కెసిఆర్ ఇప్పటికైనా గజనీ వేషాలు మానుకోవాలని హితవు పలికారు. టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతుల్లా వచ్చి గొడవకు దిగారని, కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేస్తే అవి రైతులకు తగిలాయని బండి సంజయ్ పేర్కొన్నారు. నల్గొండ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ముందుగానే ఇచ్చినప్పటికీ, పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో విఫలం అయ్యారని మండిపడ్డారు.

రైతుల కోసం దేనికైనా వెనుకాడను
రైతుల కోసం రాళ్ల దాడికి, త్యాగాలకు, అనుచిత వ్యాఖ్యలు చేసినా పోరాటాలు చెయ్యటానికి సిద్ధంగా ఉన్నామని బండి సంజయ్ స్పష్టం చేశారు. తాటాకు చప్పుళ్ళకు భయపడే పోయేది లేదని తేల్చి చెప్పారు. రైతుల దృష్టిని మళ్ళించడం కోసం శాంతిభద్రతల సమస్యలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలలో పంట కొన్న తర్వాత 48 గంటల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బుల చెల్లింపులు చేస్తుంటే, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అలాంటి పరిస్థితి లేదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.

కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలీదు
గతంలో 1800 రూపాయలు ఉన్న మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం 1960 రూపాయలకు పెంచింది అని పేర్కొన్న బండి సంజయ్, యాసంగిలో సాగు చేసే వరిని కేంద్రం కొనుగోలు చేస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు పడుతున్నా టీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోవడం లేదని బండి సంజయ్ తెలంగాణ సర్కార్ ను టార్గెట్ చేశారు. సీఎం కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు .
Recommended Video

కేసీఆర్ ఫాం హౌస్లో ఉంటే రైతుల బాధలు ఏం తెలుస్తాయి?
కెసిఆర్ ఫాం హౌస్ లో ఉంటే రైతుల సమస్యలు ఎలా తెలుస్తాయి అంటూ ప్రశ్నించారు . దసరా పండుగ కంటే ముందే రైతులు ధాన్యం తీసుకొచ్చారని, రోడ్లు, కల్లాలలో ఎక్కడ చూసినా ధాన్యమే ఉండటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలుకు ప్రతీ పైసా కేంద్రం ఇస్తుందని పేర్కొన్న బండి సంజయ్ కేంద్రం ఇప్పటికి కోటి లక్షల టన్నుల ధాన్యం కేంద్రం కొన్నదని తెలిపారు. వర్షాకాలంలో పండించిన ప్రతి గింజా కొనాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications