వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాంకుల్లో పుట్టని అప్పు: వడ్డీ వ్యాపారుల చెరలో చిక్కక తప్పదా?

ఒకేసారి రుణ మాఫీ అమలుకు నిబంధనలు అంగీకరించవని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ)తో అడ్డంకులు చెప్పింది. నాలుగేళ్లుగా వాయిదాల పద్దతిలో తెలంగాణ ప్రభుత్వం చెల్లించింది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మూడేళ్ల క్రితం 2014 అసెంబ్లీ, పార్లమెంట్ జమిలీ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), తెలుగుదేశం పార్టీ (టీడీపీ), వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ), కాంగ్రెస్ పార్టీ పోటీ పడి పంట రుణ మాఫీ ప్రకటించాయి. తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో టీడీపీ అధికారంలోకి వచ్చాయి. నాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం కూడా సమర్థించారు.

కానీ ఎన్నికల ఫలితాలు వచ్చాక తారుమారైంది. ఒకేసారి రుణ మాఫీ అమలుకు నిబంధనలు అంగీకరించవని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ)తో అడ్డంకులు చెప్పింది. నాలుగేళ్లుగా వాయిదాల పద్దతిలో తెలంగాణ ప్రభుత్వం చెల్లించింది. కానీ ఈ ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగుకు అవసరమైన రుణాలు మంజూరు చేసేందుకు నిబంధనలు అడ్డొస్తున్నాయని బ్యాంకులు నగదు లేదని సాకు చెప్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నాలుగో విడత చెల్లింపులు అందలేదని బుకాయిస్తున్నాయి.

తత్ఫలితంగా బ్యాంకుల నుంచి అన్నదాతలు ఈ ఏడాది తాము పంట రుణాలు పొందే అద్రుష్టం ఉన్నట్లు కనిపించడం లేదని చెప్తున్నారు. గతంలో ఎరువు ఉంటే.. విత్తనం దొరక్క, విత్తనం ఉంటే.. ఎరువు దొరక్క, ఈ రెండూ ఉంటే.. వర్షాల్లేక అన్నదాతలు ఏటా ఏదో ఓ రూపంలో కష్టాలను ఎదుర్కొనేవారు.

గతేడాదితో పోలిస్తే ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ముందే కాలం అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ ఈ ఏడాది పెట్టుబడికి చేతిలో చిల్లిగవ్వలేక పంటల సీజన్ ప్రారంభంలోనే అన్నదాత దిక్కులు చూస్తున్నాడు.

ఈ ఏడాది కూడా రైతులు వడ్డీ వ్యాపారి వద్ద రుణాలు పొందకుండా సాగు పని ప్రారంభించేందుకు అనువైన పరిస్థితులు కాన రావడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతేడాది చేతికొచ్చిన ధాన్యం అమ్ముకున్న రైతులకు ఇప్పటికీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో నగదు చెల్లించలేదు. కొనుగోలు కేంద్రాలు ఎత్తివేసి రెండు వారాలు గడుస్తున్నా, ఇప్పటికీ రైతుల ఖాతాలు ఖాళీగానే ఉన్నాయి. ఇక చేసేది లేక అన్నదాతలు వడ్డీ వ్యాపారుల వద్దకు పరుగు తీస్తున్నారు.

సిద్ధం కాని రుణ ప్రణాళిక

సిద్ధం కాని రుణ ప్రణాళిక

సీజన్‌ ప్రారంభమైనా ఇంకా రుణ ప్రణాళిక తయారు కాలేదు. ఈసారి ఇవ్వాల్సిన రుణాల అంచనా రూ.15 వేల కోట్లు. కానీ ఇప్పటికి బ్యాంకులు ఇచ్చిన రుణాలు రూ.1000 కోట్ల లోపే. మరోవైపు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు ప్రభుత్వం కూడా అరకొరగానే చెల్లింపులు జరిపింది. ఇంకా రైతులకు సుమారు రూ.వెయ్యి కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. దుక్కి దున్నించేందుకు ట్రాక్టర్ కిరాయి కూడా పైసలు లేని స్థితిలో రైతులు ఉన్నారు. ఆలస్యమైతే విత్తనాలు దొరుకుతాయో లేదోనని అప్పు చేసి మరీ కొనుగోళ్లు జరుపుతున్నారు.

ఆందోళనచేస్తేనే సర్దుబాట్లు

ఆందోళనచేస్తేనే సర్దుబాట్లు

రైతు చేతిలో నగదు లేకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. ఇప్పటికే రుణాలు ఇవ్వాల్సిన బ్యాంకులు.. రేపు మాపు అంటూ తిప్పుకుంటున్నాయి. మరోవైపు బ్యాంకుల్లో నగదు కొరత కూడా రైతుల ఇబ్బందులకు ఒక కారణంగా కన్పిస్తోంది. కొన్ని బ్యాంకులు రైతుకు నేరుగా డబ్బులు ఇవ్వకుండా ఖాతాల్లో వేస్తున్నాయి. దీంతో రైతులు ఇతర అవసరాలకు ఇబ్బంది పడుతున్నారు. రైతులు ఆందోళనకు దిగినచోట బ్యాంకర్లు రూ.10 వేలు ఇవ్వాల్సిన వారికి రూ.రెండు వేలు ఇస్తూ సర్దిచెబుతున్నాయి. ఇక ధాన్యం అమ్మిన డబ్బులు ఖాతాల్లో పడుతున్నా.. వాటిని చేతికి తీసుకోవడం రైతులకు ఇబ్బందికరంగా మారింది. నగదు కొరతతో సిబ్బంది రూ.2 వేల నుంచి రూ,3 వేలు మాత్రమే చేతికిస్తున్నారు.

పంటల సాగు, విత్తనాలకు ఒకేసారి సమస్య

పంటల సాగు, విత్తనాలకు ఒకేసారి సమస్య

ఓవైపు పెట్టుబడికి డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్న రైతులకు జూన్‌ నెల మరికొన్ని ఇబ్బందులను తెచ్చిపెట్టింది. ఈ నెల రెండో వారం నుంచే విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో పిల్లలకు స్కూల్‌ బుక్స్, ఫీజులు, డ్రెస్సులు తదితర అవసరాల కోసం రూ. వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తున్నది. ఇదే సమయంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో అదను సమయంలోనే విత్తనాలు వేయాలి. కీలకమైన రెండు అంశాలలోనూ ఒకేసారి నిర్ణయం తీసుకోవాల్సి రావడంతో దేనికి ఖర్చు చేయాలో తెలియక అన్నదాతలు సతమతం అవుతున్నారు.

ఇప్పటివరకు ఇచ్చింది 10 శాతమే!

ఇప్పటివరకు ఇచ్చింది 10 శాతమే!

వడ్డీ వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతోంది. రూ.2, రూ.3 వడ్డీలు పాత మాట. ఇప్పుడు వెయ్యి రూపాయలు అప్పిచ్చి నాలుగు నెలల్లో పంట చేతికి రాగానే వడ్డీ కింద రూ.1,250 నుంచి రూ.1,350 వరకు తీసుకుంటున్నారు. అప్పు మొత్తం కూడా నగదు రూపంలో ఇవ్వకుండా విత్తనాలు, మందు బస్తాలు తీసుకొచ్చి నేరుగా రైతులకు ఇస్తున్నారు. వీటిలో లాభంతోపాటు 8 శాతం వరకు వడ్డీ రూపంలో వసూలు చేస్తున్నారు. నాలుగో విడత రుణ మాఫీ డబ్బులు ఇంకా బ్యాంకులకు చేరలేదని బ్యాంకర్లు రైతులకు నచ్చజెప్పి తప్పించుకుంటున్నారు. పెద్ద బ్యాంకులు మినహా మిగతా బ్యాంకులు పది శాతం రుణాలను కూడా రైతులకు ఇవ్వలేదు. రైతులు సాగుచేస్తున్న పంటను బట్టి ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.36 వేల వరకు బ్యాంకులు రుణంగా ఇవ్వవచ్చు. అయితే రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయి.

అప్పు తెచ్చి విత్తనాలు వేస్తున్నామన్న రైతులు

అప్పు తెచ్చి విత్తనాలు వేస్తున్నామన్న రైతులు

వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్‌లో 989 మంది రైతుల వద్ద సాగు భూమి 2,450 ఎకరాలు ఉంది. ఈ గ్రామానికి సుమారు రూ.2 కోట్ల వరకు పంట రుణాలు కావాల్సి ఉండగా రూ.27 లక్షలు మాత్రమే ఇచ్చారు. కొందరు రైతులు డబ్బులు లేక ఇంకా దుక్కి కూడా దున్నలేదు. నల్లగొండ జిల్లా అనుముల మండలం రామడుగులో 1144 మంది రైతులు 3,200 ఎకరాలు సాగు చేస్తున్నారు. గ్రామంలో రూ.1.14 కోట్లు రుణమాఫీ కాగా.. మూడు విడతల్లో రైతులకు ఆ డబ్బులు చెల్లించారు. నాలుగో విడతలో రూ.36.24 లక్షలు చెల్లించాల్సి ఉంది. పెట్టుబడికి చేతిలో పెసల్లేకున్నా.. తోటి రైతులు మక్కలు విత్తుతుండటంతో వనపర్తిలో తెలిసిన వ్యాపారి దగ్గర రూ.2.50 వడ్డీకి 15 వేలు అప్పు తెచ్చానని గోపాల్ పేట మండలం పొల్కె పహాడ్ రైతు ధనుంజయ్ తెలిపాడు. రెండు విడతల రుణమాఫీ కింద రూ.9 వేలు మాత్రమే ఖాతాలో జమ చేశారు. మూడు, నాలుగో విడతల వాయిదా చెల్లింపులు ఖాతాలో పడలేదని బ్యాంకుల అధికారులు అంటున్నారు. ఇక రెండేళ్లుగా పంట నష్ట పరిహారం కూడా అందడం లేదని వాపోయారు. నాలుగో విడత రుణమాఫీ పైసలు రాక బ్యాంకు అధికారులు కొత్తగా అప్పు ఇవ్వడం లేదని నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వడ్డేమాన్ రైతు ఎన్ వెంకటయ్య వాపోయాడు.. బయట అప్పు పుట్టకపోవడంతో పొలాన్ని కౌలుకు ఇచ్చేశానని చెప్పాడు. డబ్బులు చేతిలో లేక తోటి రైతులు అవస్థలు పడుతున్నారు. దుక్కి దున్నడానికి డబ్బులు లేవని భద్రాద్రి - కొత్తగూడెం జిల్లా అనంతారం గ్రామ వాసి ఈసం లింగయ్య తెలిపాడు. గత ఏడాది నాలుగు ఎకరాల్లో మిర్చి, మూడు ఎకరాల్లో పత్తి వేస్తే మిర్చి పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రాకపోగా రూ.3 లక్షలు నష్టం వచ్చిందని, అందుకే ఈ సంవత్సరం పత్తి ఎక్కువగా వేయాలనుకుంటున్నానని చెప్పాడు. కానీ పంటల సాగుకు చేతిలో డబ్బులేక.. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కోసం దుకాణాల్లో అప్పుల చేయాల్సి వస్తోందన్నాడు.

English summary
Bankers reluctant to gave crop loans for farmers while demonitization also one reason. Present economic year bankers estimate is to give loans Rs.15,000 crores but they had given below Rs.1000 crores only.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X