రూ.2.5 లక్షలకు మించితే వివరాలివ్వండి: ఆదేశాలు, 'మాల్యా రుణం రద్దు కాలేదు'
న్యూఢిల్లీ/హైదరాబాద్: రూ.2.5 లక్షల కంటే ఎక్కువగా తమ సేవింగ్ అకౌంట్లలో డిపాజిట్ చేసే వారి పైన కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. తమ అకౌంట్లలో అంతకు మించి ఎవరైనా క్యాష్ డిపాజిట్ చేస్తే ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్టుమెంటుకు (ఆదాయపన్ను శాఖ) సమాచారం ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది.
నోట్ల మార్పిడి నేపథ్యంలో ఈ మేరకు బ్యాంకులు, పోస్టాఫీసులకు సూచించింది. అలాగే, ఒక రోజులో రూ.50 వేలకు పైగా డబ్బులను డిపాజిట్ చేసిన వారి వివరాలు కూడా బ్యాంకులు ఆదాయ పన్ను శాఖకు ఇవ్వనున్నాయి. బ్యాంకులలో జరిగిన ట్రాన్సాక్షన్స్‌కి సంబంధించిన వివరాలు ఇచ్చేందుకు పోస్టాఫీసులు, బ్యాంకులకు జనవరి 31వ తేదీ వరకు సమయం ఇచ్చింది.

మాల్యా రుణం రద్దు కాలేదు
మొండి బకాయిలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో పార్లమెంట్‌లో విపక్షాలు మండిపడ్డాయి. దీంతో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ వివరణ ఇచ్చారు. ఎస్బీఐ రద్దు చేసినవి కేవలం మొండి బకాయిలు మాత్రమేనని, అది వాళ్ల రిజిస్టర్‌లో రాసుకోవడానికి మాత్రమే అన్నారు.
అంతేకానీ ఈ చర్యకు అర్థం రుణ మాఫీ చేసినట్లు కాదని, అప్పులను వసూలు చేయకుండా వదిలేస్తామనీ కాదని, రుణం వసూలు చేసే చర్యలు కొనసాగుతాయని జైట్లీ రాజ్యసభలో ప్రకటించారు. కాగా, విజయ మాల్యా సహా 63 మంది రుణాలు రద్దయినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications