ఆస్తమా బాధితులకు గుడ్‌న్యూస్: బత్తిని సోదరుల చేపమందు పంపిణీ ఎప్పట్నుంచంటే?
హైదరాబాద్: అస్తమా బాధితులకు ఇది నిజంగా శుభవార్తనే. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత మూడేళ్లుగా ఆగిపోయిన బత్తిన సోదరుల చేపమందు ప్రసాదం పంపిణీ ఈ ఏడాది ప్రారంభం కానుంది. ఈ ఏడాది చేపమందు పంపిణీ కోసం తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎప్పటిలానే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేపమందు పంపిణీ చేయడానికి అనుమతి లభించింది. దీంతో చేపమందు పంపిణీపై బత్తిని సోదరులు ఓ ప్రకటన విడుదల చేశారు.
ప్రతి ఏడాది కూడా ఉచితంగానే బత్తిని సోదరులు చేపమందు పంపిణీ చేస్తుంటారు. ఈ చేపమందు కోసం తెలంగాణ నుంచే గాక, ఇతర ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది తరలివస్తుంటారు. చేపమందు వేసుకుంటే అస్తమా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు నయమవుతాయని నమ్ముతారు. ఈ నమ్మకంతోనే వేలాది మంది చేపమందు కోసం తరలివస్తుంటారు.

కరోనా కారణంగా మూడేళ్లుగా ఆగిన చేపమందు కార్యక్రమం ఈ ఏడాది తిరిగి ప్రారంభం కావడంతో ఈసారి ఎక్కువ సంఖ్యలో అస్తమా బాధితులు వచ్చే అవకాశం ఉంది. జూన్ 10 తేదీన ఉదయం 8 గంటల నుంచి మృగశిర కార్తె ప్రవేశించగానే చేపమందు పంపిణీ ప్రారంభిస్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో 24 గంటలపాటు చేపమందు పంపిణీ చేయనున్నారు.
ప్రతిసారిలాగానే చేపమందు కోసం దేశం నలుమూలల నుంచి అస్తమా బాధితులు హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. బత్తిన సోదరులు అందించే చేపమందు కోసం జనాలు తెల్లవారకముందు నుంచే కిలోమీటర్ల మేర బారులు తీరుతారు. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు వచ్చి చేపమందు కోసం ఎదురుచూస్తుంటారు. ప్రభుత్వం ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేస్తుంది.
కాగా, చేపమందు ప్రసాదం పంపిణీ చేయడంలో ప్రసిద్ధి చెందారు బత్తిన సోదరులు. గత 75 ఏళ్లుగా సంప్రదాయబద్ధంగా బత్తిని కుటుంబం చేపమందు ప్రసాదాన్ని పంపిణీ చేస్తోంది. శాస్త్రీయతలేదంటూ కొందరు వాదించినప్పటికీ.. ప్రజలు మాత్రం చేపమందు మీద నమ్మకంతో వేలాదిగా తరలివస్తుండటం గమనార్హం. ఈసారిగా కూడా అదే స్థాయిలో ప్రజల నుంచి స్పందన వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications