స్టేషన్ ఘనపూర్ గులాబీల పోరు.. కడియం శ్రీహరి వర్సెస్ తాటికొండ రాజయ్య..నువ్వా నేనా!!
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రెండు దఫాలుగా అధికారాన్ని కొనసాగిస్తున్న టిఆర్ఎస్ పార్టీ మూడవ దఫా కూడా గులాబీ జెండా ఎగురవేయాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తుంటే, పార్టీ నేతలు మాత్రం అంతర్గత కలహాలతో తన్నుకు చస్తున్నారు. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు, టీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారింది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే పార్టీ నేతల మధ్య పంచాయితీ పీక్స్ కి చేరుకుంది.

వచ్చే ఎన్నికల్లో టికెట్ల కోసం గులాబీ నేతల పంచాయితీ
తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయేమోనని అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెట్టాయి. ప్రత్యర్థి పార్టీలను ఎలా చిత్తు చేయాలని వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇక గులాబీ పార్టీ నేతలు మాత్రం, సొంత పార్టీలోని ప్రత్యర్థి వర్గానికి ఎలా చెక్ పెట్టాలని ఆలోచిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. టిఆర్ఎస్ పార్టీలో పాత, కొత్త నేతలు అందరూ టికెట్ల కోసం ప్రయత్నాలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో, టికెట్ల కోసం ఇప్పుడే నియోజకవర్గాలలో పంచాయితీలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.

స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి వర్సెస్ తాటికొండ రాజయ్య
ఇక స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం విషయానికి వస్తే నియోజకవర్గంలో కడియం శ్రీహరి వర్సెస్ తాటికొండ రాజయ్య అన్నట్టుగా రాజకీయాలు సాగుతున్నాయి. అక్కడ ప్రత్యర్థి పార్టీల నేతలు బలంగా లేకపోవడంతో సొంత పార్టీల నేతలే బలంగా తన్నుకుంటున్నారు. పోటాపోటీగా కార్యక్రమాలను నిర్వహిస్తూ కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య వర్గాలు నియోజకవర్గంపై ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో కీలకంగా పని చేసి, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన కడియం శ్రీహరికి స్థానికంగా ఉన్న ఇమేజ్ ను ఈసారి వచ్చే ఎన్నికలలో వాడుకోవాలని ఆయన నిర్ణయించారు.

నియోజకవర్గంలో నువ్వా నేనా అంటున్న కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యలు
అసెంబ్లీ ఎన్నికలపై గురి పెడుతున్న కడియం శ్రీహరి, టికెట్ విషయంలో తాటికొండ రాజయ్య కు చెక్ పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక నియోజకవర్గంలో ఎమ్మెల్యే గా కొనసాగుతున్న డాక్టర్ తాటికొండ రాజయ్య ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్ల కడియం శ్రీహరికి నియోజకవర్గ వ్యవహారాలలో వేలు పెట్టడానికి అవకాశం దొరుకుతుంది. ఇక ఇదే సమయంలో గతంలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం లో అభివృద్ధి పై తనదైన ముద్ర వేసిన కడియం శ్రీహరి తో తాటికొండ రాజయ్య వ్యతిరేకత కూడా నియోజకవర్గంలో రెండు వర్గాలకు మధ్య ఘర్షణలకు కారణమవుతుంది.

రాజయ్య పై అనేక వివాదాలు.. అవినీతి ఆరోపణలు
2009లో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తాటికొండ రాజయ్య, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2014 ఎన్నికలను, ఆపై 2018 ఎన్నికలను ఎమ్మెల్యేగా స్టేషన్ ఘన్పూర్ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన స్థానికంగా పట్టు కోసం శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాజయ్య చేసే వివాదాస్పద వ్యాఖ్యలు, తీసుకునే వివాదాస్పద నిర్ణయాలు, రాజధాని పై ఉన్న అవినీతి ఆరోపణలు ఆయనకు తలనొప్పిగా తయారయ్యాయి.

అదును చూసి అసెంబ్లీ స్థానంపై గురి పెడుతున్న కడియం శ్రీహరి
ఇక ఇదే అదునుగా వచ్చే ఎన్నికలలో అసెంబ్లీ స్థానానికి గురిపెట్టిన కడియం శ్రీహరి, తనకు గానీ తన కుమార్తె కావ్యకు కానీ అవకాశం ఇస్తే బాగుంటుందని నియోజకవర్గంపై దృష్టి సారించారు. నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలో అన్ని వర్గాలను కలుపుకుని పోతూ ప్రజల్లో పట్టుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కడియం శ్రీహరి వ్యవహారం రుచించని తాటికొండ రాజయ్య కడియం శ్రీహరి కి చెక్ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

స్టేషన్ లో గులాబీల పోరు... టీఆర్ఎస్ పార్టీకి నష్టం
ఇలా ఒకరిపై ఒకరు ఎత్తుగడలు వేసుకుంటూ స్టేషన్ లో గులాబీల పోరును పీక్స్ కు తీసుకు వచ్చారు. ఇప్పటివరకు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో బలమైన ప్రత్యర్థులు ఎన్నికల బరిలోకి దిగలేదు. ఇది టీఆర్ఎస్ పార్టీకి లాభించింది. ఇక ఈ సారి బలమైన అభ్యర్థులు బరిలోకి గులాబీల కొట్లాట తో టిఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.












Click it and Unblock the Notifications