వరదలో చిక్కుకున్న 20 మంది కూలీలను కాపాడిన ఎన్డీఆర్ఎఫ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో పెద్దవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా వరద ప్రవాహం వచ్చింది. ఈ వరదలో 20 మంది కూలీలు చిక్కుకుపోయారు. అశ్వారావుపేట మండలం నారాయణపురం వద్ద వరదలో చిక్కుకున్న కూలీలు సాయం కోసం ఎదురుచూశారు. అధికారులు సమాచారం అందించడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయంపై సీఎంవో మాట్లాడారు. ఈ క్రమంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. పెద్దవాగు వరదలో చిక్కుకున్న 20 మంది కూలీలను కాపాడాయి. ఏలూరు నుంచి వచ్చిన హెలికాప్టర్‌లో కూలీలను సురక్షితంగా తరలించారు. కూలీలంతా క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇది ఇలావుండగా, నారాయణపురం బ్రిడ్జీపై మరో 20 మంది కూలీలు చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దమ్మపేట మండలంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీళ్లు చేరి స్థానికులు ఇబ్బందులు పడ్డారు. దమ్మపేట-మందలపల్లి ప్రధాన రహదారిపై వరదనీరు ప్రవహిస్తోంది. ములకలపల్లి మండలంలో రహదారులపై నీరు చేరి పలు చోట్ల రాకపోకులకు అంతరాయం ఏర్పడింది.
మరోవైపు భద్రాద్రి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లోని వారిని ఇళ్లు ఖాళీ చేపించి సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అవసరం అయితే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు.
పిడుగుపాటుకు ఇద్దరు పిల్లలు మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
అశ్వారావుపేట నియోజకవర్గం వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. వర్షాలతోపాటు పిడుగుపడటంతో దమ్మపేట మండలంలోని ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు మృతి చెందారు.
జమిందారు బంజరుకు చెందిన బుర్ర చందు (11), సిద్దు (9) గ్రామం సమీపంలోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. ఆ సమయంలో పిడుగు పడటంతో వారిద్దరూ దుర్మరణం చెందారు. ఇద్దరు పిల్లలు ఒకేసారి మృత్యువాత పడటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఇద్దరు పిల్లలు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications