అన్నంపెట్టే రైతన్నల్ని రౌడీలంటారా?, కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: భట్టి

Subscribe to Oneindia Telugu

కురవి: కష్టించి పనిచేస్తూ అన్నంపెట్టే రైతన్నల్ని రౌడీలని, దేశద్రోహులని ముద్రవేస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. ఖమ్మం ఘటనలో జైలుకు వెళ్లిన మహబుబాబాద్‌ జిల్లా కురవి మండలం సూదనపల్లి శివారు బోడ భూక్య గిరిజన తండాకు చెందిన భూక్య అశోక్‌ అనే యువరైతు కుటుంబాన్ని ఆయన కాంగ్రెస్‌ రాష్ట్ర నేతలతో కలిసి మంగళవారం పరామర్శించారు.

ఖమ్మం ఘటనలో పాల్గొన్నది రైతులేననే వాస్తవాన్ని తెలియజేసేందుకు తాము పర్యటిస్తున్నామన్నారు. ఈ ఘటనలో రౌడీలు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే కుట్ర చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు ప్రకటన చేశారన్నారు. ఎలాంటి నేరచరిత్ర లేని అశోక్‌ను అరెస్టు చేయడం అన్యామన్నారు.

తండ్రికి గుండెలో నొప్పి ఉందని మార్కెట్‌లో మిర్చి సరకును విక్రయించేందుకు అశోక్‌ వెళ్లాడని ఆయన వివరించారు. అమాయకులపై కేసులు పెట్టి వార్ని కుట్రదారులనడం భయంకరమైన అరాచకత్వానికి నిదర్శనమన్నారు. ఖమ్మం ఘటనలో జైలుకు వెళ్లిన పది మంది అమాయక రైతులేనన్నారు. వార్ని జైలుకు పంపి అవమానపర్చిన ఈ ప్రభుత్వం మెడలు వంచాలన్నారు.

Bhatti Vikramarka

బేషరతుగా వారిపై పెట్టిన కేసుల్ని ఎత్తివేసి గౌరవంగా ఇంటికి పంపించాలని డిమాండ్‌ చేశారు. అమాయక రైతులపై కేసులు పెట్టడాన్ని చూసి చలించిన 60 మంది న్యాయవాదులు స్వచ్ఛందంగా వారి తరఫున వాదిస్తామని ముందుకు వచ్చారన్నారు. ' మీకు ధైర్యం ఇవ్వడానికే వచ్చాం..మీరు ఏమాత్రం భయపడవద్దు.. మీ బిడ్డల్ని కాపాడే బాధ్యత మాది ఎంత పోరాటమైనా చేసి కాంగ్రెస్‌ పార్టీ వార్ని విడిపిస్తుంది' అని అశోక్‌ తల్లిదండ్రులు వీరన్న, విజయకు, సోదరి అంకితకు భట్టి హామీ ఇచ్చారు.

గూండాలుగా ముద్ర వేయడం హేయం: వీహెచ్‌

రైతుల్ని గూండాలుగా ముద్ర వేసి కేసులు బనాయించటం ప్రభుత్వానికి తగదని కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వీహెచ్‌ హన్మంతరావు ధ్వజమెత్తారు. మిర్చి పంట పండిస్తే దేశద్రోహులవుతారా.. ఇది రైతుల ప్రభుత్వమేనా అని ఆయన విమర్శించారు. కొడుకును జైల్లో పెడితే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమికావాలని అన్నారు. అశోక్‌ కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతు మాధవరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు భరత్‌చందర్‌రెడ్డి, మహబూబాబాద్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఉమ, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సుచరిత తదితరులు పాల్గొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress Leader Bhatti Vikramarka on Tuesday lashed out at Telangana CM K Chandrasekhar Rao.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి