ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండండి: డిప్యూటీ సీఎం భట్టి
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలెక్టర్లను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కురుస్తున్న భారీవర్షాలతో ఏర్పడిన విద్యుత్ సమస్యలపై డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. విద్యుత్ అధికారులతో మధిర తహసీల్దార్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వర్షాల కారణంగా విద్యుత్ అంతరాయం కలిగిన చోట పునరుద్ధరణకు కలెక్టర్, పోలీస్ రెవెన్యూ, జిల్లా శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చేయాలని ఆదేశించారు. అంతేగాక, వరదల వల్ల నీట మునిగిన సబ్ స్టేషన్లు, పిడుగులు పడి దెబ్బతిన్న చోట్ల మరమ్మతులు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయంగా పక్క సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్తును సరఫరా చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.

24 గంటలు అలర్ట్‌గా ఉండి కంట్రోల్‌రూమ్ నుంచి వచ్చే ఆదేశాలను అధికారులు ఎప్పటికప్పుడు అమలు చేయాలని స్పష్టం చేశారు. విద్యుత్ అంతరాయానికి సంబంధించిన సమస్యలు ఉంటే ప్రజలు వాటి పరిష్కారం కోసం విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన 1912 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
మరోవైపు, తెలంగాణలోని 11 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆయా జిల్లా కలెక్టర్లు, ఆర్ అండ్ బీ శాఖ క్షేత్రస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి కూడా వర్షాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టంచేశారు. హైడ్రాతో గొలుసుకట్టు చెరువులను పునరుద్దరణ చేస్తున్నామని, వచ్చే ఏడాది నుంచి హైదరాబాద్‌కు వరద ముంపు ఉండదన్నారు. మరోవైపు, భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ అధికారులను సెలవులను రద్దు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications