డీజీ వేధింపులు: భువనగిరి సబ్ జైలు సూపరిండెంటెంట్ అదృశ్యం
హైదరాబాద్: నల్గొండ జిల్లా భువనగిరి సబ్ జైలు సూపరిండెంటెంట్ శ్రీనివాస్ మంగళవారం రాత్రి అదృశ్యమయ్యారు. తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని ఇంట్లో లేఖ రాసి మరీ అదృశ్యమవడం కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే... ఉద్యోగానికి వెళ్తున్నానంటూ ఆయన మంగళవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లారు. బుధవారం ఉదయం ఆయన ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అనుమానం వచ్చిన శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఇళ్లంతా వెతకడంతో శ్రీనివాస్ రాసిన లేఖ బయట పడింది.

కిశోర్ అనే రిమాండ్ ఖైదీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాత్రికి రాత్రే తనను జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటకు బదిలీ చేశారని, దీంతో తీవ్ర మనస్తాపానికి గురై తాను ఆత్మహత్య చేసుకుంటాన్నానని అందులో పేర్కొన్నాడు. జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ వేధింపులు భరించలేకే తాను వెళ్లిపోతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.
దీంతో తీవ్ర ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు లేఖను తీసుకుని భువనగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు శ్రీనివాస్ ఆచూకీని కనిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఉన్నాతాధికారుల వేధింపుల వల్ల పలువురు పోలీసులు ఆత్మహత్మకు పాల్పడిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో శ్రీనివాస్ లేఖ బయటకు రావడం తీవ్ర కలకలం రేపింది. శ్రీనివాస్ అదృశ్యంపై అతడి కుటుంబ సభ్యులు భువనగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని పోలీసు శాఖ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications