ఖైరతాబాద్ గణేష్ లడ్డూ కోసం పోలీసులూ ఎగబడ్డారు, 'తాపేశ్వరం' లడ్డూ అమ్ముకున్నారు
హైదరాబాద్: ఖైరతాబాద్ గణేష్ లడ్డూ కోసం భక్తులు భారీగా తరలి వచ్చారు. అయితే, లడ్డూ ప్రసాదం కోసం పోలీసులు కూడా ఎగబడ్డారనే వాదనలు వినిపిస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం ఖైరతాబాద్ వినాయకుడిని వినాయక సాగర్‌లో నిమజ్జనం చేసిన విషయం తెలిసిందే.
శుక్రవారం నాడు ఖైరతాబాద్ గణేషుడి లడ్డూ ప్రసాదం పంచుతామని తెలిపారు. దీంతో, పెద్ద ఎత్తున భక్తులు ఈ రోజు (శుక్రవారం) తరలి వచ్చారు. భక్తులను వరుసలో నిలబెట్టారు. పెద్ద ఎత్తున భక్తులు రావడంతో, క్యూలైన్లు అదుపు తప్పాయి. పోలీసులు కూడా ప్రసాదం కోసం ఎగబడ్డారని అంటున్నారు.

తాము వేకువజామునే లడ్డూ ప్రసాదం కోసం వచ్చామని, అయినప్పటికీ తమకు దొరకడం లేదని పలువురు వాపోతున్నారు. పెద్ద పెద్ద సంచులు తీసుకు వచ్చి లడ్డూ ప్రసాదాన్ని కొందరు తీసుకు వెళ్తున్నారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
వినాయక చవితి సందర్భంగా భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఖైరతాబాదులో 59 అడుగుల భారీ వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ వినాయకుడి చేతిలో ఏపీలోని తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు 5,600 కేజీల లడ్డూను తయారు చేశారు.
వినాయక నిమజ్జనం అనంతరం... లడ్డూ ప్రసాదాన్ని భద్రపరచిన ఉత్సవ కమిటీ సభ్యులు శుక్రవారం భక్తులను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. నేటి ఉదయం పది గంటల తర్వాత నుంటి ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. దీంతో ప్రసాదం కోసం ఉదయం నుంచే ఖైరతాబాదులో భక్తులు బారులు తీరారు.
తాపేశ్వరం చేరాల్సిన లడ్డూను అమ్ముకున్నారు
తాపేశ్వరం చేరాల్సిన ఖైరతాబాద్ వినాయకుడి లడ్డూను కొంతభాగం కొందరు అమ్ముకున్నారు. హైదరాబాదులో లడ్డూ ప్రసాదాన్ని పంచుతున్నారు. మరోవైపు తాపేశ్వరం కొంత చేరాల్సి ఉంది. దానిని లారీలో ఎక్కించి పంపించారు.
అయితే, దానిని హయత్ నగర్ వద్ద అమ్ముకునే ప్రయత్నాలు చేశారు. అబ్దుల్లాపూర్ మెట్ వద్ద లారీ ఆపి అమ్మే ప్రయత్నం చేశారు. మీడియా ప్రతినిధులు అక్కడకు చేరుకునేసరికి వెళ్లిపోయారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications