అల్లు అర్జున్ కు హైకోర్టు బెయిల్ - కండిషన్లు ఇవే..!
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా థియేటర్ కు వెళ్లి తొక్కిసలాటలో ఓ మహిళ మృతికి కారణమయ్యారన్న ఆరోపణలపై ఇవాళ చిక్కడపల్లి పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. దీనిపై ఆయన దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై స్పందించిన హైకోర్టు.. ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.

ఇవాళ ఉదయం అల్లు అర్జున్ ను సంధ్య థియేటర్ తొక్కిసలాటపై నమోదైన కేసులో అరెస్టు చేసిన పోలీసులు జుబ్లీహిల్స్ లోని ఇంటిి నుంచి పీఎస్ కు తరలించారు. ఆ తర్వాత గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. అనంతరం నాంపల్లి కోర్టు ఆయనకు రెండు వారాల పాటు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయన్ను చంచల్ గూడ జైలుకు కూడా తరలించారు. అదే సమయంలో హైకోర్టులో గతంలో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ ప్రారంభమైంది.
హైకోర్టులో జరిగిన విచారణలో అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పు ఇచ్చేందుకు న్యాయస్ధానం నిరాకరించిది. అదే సమయంలో కనీసం మధ్యంతర బెయిల్ అయినా ఇవ్వాలని ఆయన న్యాయవాదులు కోరారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. అయినా కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ ను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు హైకోర్టు అల్లు అర్జున్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. కేవలం నటుడు కాబట్టే ఆయనపై ఆయా సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారా అని పోలీసుల్ని ప్రశ్నించింది. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్ కు వర్తించవని తెలిపింది. అల్లు అర్జున్ కు కూడా జీవించే హక్కు ఉందని తెలిపింది. అయితే మృతురాలు రేవతి కుటుంబంపై మాత్రం తమకు సానుభూతి ఉందని తెలిపింది. అల్లు అర్జున్ బెయిల్ తీసుకునేందుకు 50 వేల పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అలాగే పోలీసుల విచారణను ప్రభావితం చేయరాదని షరతు పెట్టింది.












Click it and Unblock the Notifications