కేసీఆర్ ను టెన్షన్ పెట్టేలా వచ్చే రెండేళ్ళు పోరు వ్యూహాలతో బీజేపీ రెడీ ..దూకుడు పెంచిన బండి సంజయ్
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దూకుడు పెంచుతోందా? టిఆర్ఎస్ సర్కారును బలంగా ఢీ కొట్టడానికి వ్యూహాలను రచిస్తోందా? ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోందా? హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం ఇచ్చిన జోష్ తో బిజెపి కార్యక్షేత్రంలోకి దిగుతుందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

వచ్చే రెండేళ్ళ పాటు బీజేపీ పోరుబాట
వచ్చే రెండేళ్లపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, టిఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ ప్రజలకు బిజెపి అండగా నిలుస్తుందని నమ్మకాన్ని కలిగించేలా బీజేపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటి నుండే వివిధ సమస్యలపై ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని ప్రజా సమస్యలపై పోరాటం చేసినప్పుడే, ప్రజల కోసం బలమైన వాయిస్ ను వినిపించగలిగినప్పుడే పార్టీపై నమ్మకం కలుగుతుందని ఆ దిశగా క్యాడర్ పనిచేయాలని, దూకుడుగా ముందుకు వెళ్లాలని బిజెపి నాయకత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. వచ్చే రెండేళ్లపాటు వివిధ సమస్యలపై పోరుబాట పట్టాలని బిజెపి నాయకత్వం పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులను చేస్తోంది.

తెలంగాణా బీజేపీలో పెరిగిన బలమైన నాయకత్వం .. టీఆర్ఎస్ కు టెన్షన్
బీజేపీ తెలంగాణా రాష్ట్రంలో బాగా పుంజుకుంటోంది. పార్టీ తరపున బలంగా వాయిస్ వినిపించే నేతలు కూడా ఉన్నారు. పార్టీ రథ సారధి బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్,విజయశాంతి, డీకే అరుణ, రాజా సింగ్ , రఘునందన్ రావు, ఈటల రాజేందర్, వివేక్ వెంకట స్వామి తదితరులు పార్టీ వాణిని బలంగా వినిపిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు. కేసీఆర్ ను, తెలంగాణా సర్కార్ ను టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు చుక్కలు చూపిస్తున్నారు.

ధాన్యం కొనుగోళ్ళ విషయంలో బీజేపీ కలెక్టరేట్ ల ముట్టడి
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో దాన్యం కొనుగోలు విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని, తక్షణమే వాన కాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రోజు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టాలని బిజెపి నిర్ణయించింది. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు అమలు, నిరుద్యోగ భృతి, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల పై కూడా పోరుబాట పట్టాలని, ఉద్యమాన్ని ముందుకు నడిపించాలని బిజెపి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది.

ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగ మిలియన్ మార్చ్ ప్లాన్
ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 16వ తేదీన ట్యాంక్ బండ్ పై నిరుద్యోగ మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని బీజేపీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన మిలియన్ మార్చ్ ను విజయవంతం చేస్తామని బిజెపి వెల్లడించింది. ఇప్పటివరకు ఉద్యోగాల కోసం రెండు వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉండకూడదని, వారికి భరోసా ఇచ్చి ,వారిలో ధైర్యం కల్పించడం కోసం, ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కోసం నిరుద్యోగ మిలియన్ మార్చ్ ను ప్రజాస్వామ్యబద్దంగా నిర్వహిస్తామని వెల్లడించింది.

వచ్చే ఏడాది కాలమంతా ప్రజా సంగ్రామ యాత్ర ప్లాన్
ఇక ఇదే సమయంలో ఈ నెల 21 నుండి రెండో విడత పాదయాత్రలో భాగంగా వచ్చే సంవత్సరం కాలమంతా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో చుట్టి వచ్చేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. క్షేత్ర స్థాయిలో కి బిజెపిని తీసుకు వెళ్లడం కోసం, ప్రజలలో బిజెపి పట్ల ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం 2022 సంవత్సరం అంతా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో బిజెపి నాయకులు పర్యటించనున్నారు.

2023 సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికల వ్యూహం
ఆ తరువాత 2023 సంవత్సరమంతా అసెంబ్లీ ఎన్నికల వ్యూహంతో ముందుకు వెళ్లాలని, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ఆ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకుని, టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బిజెపి ఎదగాలని, అందుకోసం ఇప్పటి నుంచే జోష్ తో పార్టీ శ్రేణులు పనిచేయాలని బిజెపి నాయకత్వం శ్రేణులకు పిలుపు నిస్తుంది. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ మంగళ బుధవారాల్లో రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలతో, వివిధ మోర్చాలతో, అనుబంధ విభాగాల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, ఇంచార్జి లతో కీలక సమావేశాలు నిర్వహించి, జిల్లాలలో పరిస్థితిని సమీక్షించి తదనుగుణంగా దిశానిర్దేశం చేసింది. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ , రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, కీలక నేతలు పార్టీ శ్రేణులకు నిర్దేశం చేశారు
Recommended Video

కీలక భేటీలతో పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం .. పోరు వ్యూహాలతో బీజేపీ సిద్ధం
వరుస భేటీలతో కమలం నేతలు టిఆర్ఎస్ సర్కార్ కు పూర్తి స్థాయిలో చెక్ పెట్టడానికి వ్యూహాలు రచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలోపేతం చేయడం కోసం, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ను టార్గెట్ చేస్తూ ఇప్పటినుంచే అడుగులు వేయాలని భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ను బలంగా ఢీకొట్టడంలో బిజెపి ఒక అడుగు ముందుకు వేసినట్లుగా తాజా పరిణామాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఈ క్రమంలోని భవిష్యత్లోనూ బిజెపి, టిఆర్ఎస్ పార్టీ కి చెక్ పెట్టడానికి ఇప్పటి నుంచే పోరు వ్యూహాలను నిర్దేశం చేసుకొని ముందుకు వెళుతుండటం తెలంగాణ రాజకీయ వర్గాలలో ఆసక్తిని కలిగిస్తుంది. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బిజెపి తెలంగాణలో బలపడుతుందేమో అన్న భావనకు ఊతం ఇస్తోంది.












Click it and Unblock the Notifications