పవన్ కళ్యాణ్‌ను మేం పిలవలేదు: కిషన్ రెడ్డి, కెసిఆర్‌పై ఫిర్యాదు: రేవంత్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించలేదని తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి శనివారం నాడు చెప్పారు. హైదరాబాదులో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
ప్రచారానికి పవన్ కల్యాణ్‌ను పిలవలేదని చెప్పారు. మంగళవారం నిర్వహించనున్న ప్రచారంలో కేంద్రమంత్రులు పాల్గొంటారని తెలిపారు. టీడీపీ-బీజేపీ కలిపి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామన్నారు. 26వ తేదీ సాయంకాలం నిర్వహించనున్న రెండు సభలలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పాల్గొననున్నారన్నారు.
ఆ రెండు సభలకు సంబంధించిన వివరాలను రేపు ప్రకటిస్తామన్నారు. కేంద్ర జౌళీశాఖా మంత్రి సంతోష్ గంగ్వార్, పలువురు నాయకులు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారని తెలిపారు. వచ్చే నెలలో తెలంగాణకు ప్రధాని మోడీ రానున్నారని చెప్పారు. రామగుండం ఎరువుల కంపెనీ, ఎన్టీపీసీలకు మోడీ శంకుస్థాపన చేశారన్నారు.

కేంద్ర ప్రభుత్వం సాయంతోనే హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందిందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. హైదరాబాద్ మహా నగరం ఓ మినీ భారత దేశం అన్నారు. ఉగ్రవాదులకు మజ్లిస్ పార్టీ మద్దతుగా నిలుస్తోందని ఆరోపించారు. మజ్లిస్ పార్టీతో తెరాసకు లోపాయకారి ఒప్పందం ఉందన్నారు.
సీఎం కేసీఆర్‌పై ఈసీకి ఫిర్యాదు: రేవంత్ రెడ్డి
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న సీఎం కేసీఆర్‌పై ఎన్నికల కమిషన్(ఈసీ)కి ఫిర్యాదు చేసినట్లు తెలంగాణ టిడిపి కార్యనిర్వాహక అధ్యక్షులు రేవంత్ రెడ్డి చెప్పారు. శనివారం ఆయన ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు రైలు నడుపుతామని, దుర్గం చెరువుపై వంతెన నిర్మిస్తామని సీఎం చెప్పడం.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి టెండర్లు పిలవడం వంటివన్నీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని ఆరోపించారు.
రంగారెడ్డి జిల్లా పరిధిలో 66 డివిజన్లలో ఎన్నికలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో ఎత్తిపోతల పథకానికి టెండర్లు పిలవడం ద్వారా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో రూ.5 లక్షల కంటే ఎక్కువ ఖర్చుపెట్టిన వారిని అనర్హులుగా ప్రకటించాలని ఈసీని కోరినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications