మునుగోడులో లో 31న బీజేపీ బహిరంగ సభ : రెండు పార్టీల హోరాహోరీ..!!
మునుగోడ ఉప ఎన్నిక ప్రచారం హోరా హోరీగా సాగుతోంది. దీపావళి తరువాత మూడు కీలక నేతలు ప్రచారంలోకి దిగనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 30న మునుగోడులో ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. అటు బీజేపీ ఈ నెల 31న బహిరంగసభకు ప్లాన్ చేసింది. ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరు పైన స్పష్టత రావాల్సి ఉంది. అటు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల వ్యవహారాల్లో షా బిజీగా ఉండటంతో ఆయన మునుగోడు ప్రచారానికి వచ్చే అవకాశం లేదనేది మరో వాదన. దీంతో..పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 31న జరిగే మునుగోడు బహిరంగ సభకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
ఇటు కాంగ్రెస్ మాత్రం స్థానిక నేతలతోనే ప్రచారం కొనసాగిస్తోంది. నేటి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. మునుగోడు ఎన్నికల ఫలితాలు వెల్లడి వరకూ యాత్ర కొనసాగనుంది. దీంతో..పార్టీ ముఖ్య నేతలంతా యాత్ర సక్సస్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో లీక్ తో పాటుగా రాజగోపాల్ గెలుస్తారంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నాయి. ఇటు బీజేపీ - టీఆర్ఎస్ పార్టీల్లో రాజకీయ చేరికలు పెరిగాయి. ఒక పార్టీకి షాక్ ఇచ్చేందుకు మరో పార్టీ నేతలను ట్రాప్ చేస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీలు మారారు. టీఆర్ఎస్ మంత్రులు ..ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో మునుగోడులో మొహరించారు.

ఈ నెల 26వ తేదీ నుంచి నవంబర్ 1వ తేదీ వరకు మునుగోడు చివరి దశ ప్రచారం హోరెత్తించేందుకు ప్రణాళికలు సిద్దమయ్యాయి. ఇప్పటికే నేతల మధ్య సవాళ్లు తారా స్థాయికి చేరాయి. అటు నగదు కూడా పెద్ద మొత్తంలో పట్టు బడుతోంది. బీఆర్ఎస్ ప్రకటన తరువాత జరుగుతున్న తొలి ఎన్నిక కావటంతో..ఇప్పుడు ఈ ఎన్నిక టీఆర్ఎస్ కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఎలాగైనా గెలిచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల ముందు పాజిటివ్ సంకేతాలతో బరిలోకి దిగాలనేది బీజేపీ లక్ష్యం. దీంతో..ఈ వారం రోజులు మునుగోడు కేంద్రంగా ఆసక్తి కర రాజకీయం చోటు చేసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications