తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్: రేపు హైదరాబాద్‌కు జేపీ నడ్డా
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల సంవత్సరంలోకి ప్రవేశించినట్టే. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది. 2023 నవంబర్ నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్త ప్రభుత్వాన్ని ఏ పార్టీ ఏర్పాటు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే- త్రిముఖ పోరు ఖాయం అయ్యేలా ఉంది. అధికార టీఆర్ఎస్‌కు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ గట్టి పోటీని ఇచ్చేలా కనిపిస్తోన్నాయి.
తెలంగాణలో తమకు సానుకూలంగా ఉందని భావిస్తోన్న రాజకీయ పరిస్థితులను మరింత బలోపేతం చేయడంపై బీజేపీ అధిష్ఠానం అప్పుడే దృష్టి సారించింది. పార్టీలో నెలకొన్న సమన్వయ లోపాన్ని తొలగించడానికి, బూత్ స్థాయిలో పటిష్ఠ పర్చడానికీ ప్రాధాన్యత ఇస్తోంది. పార్టీని క్షేత్రస్థాయిలో క్రియాశీలకం చేయడానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ విషయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సహాయ, సహాకారాలను తీసుకుంటుందనడంలో సందేహాలు అక్కర్లేదు.

ఇందులో భాగంగా- బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం హైదరాబాద్‌కు రాబోతోండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. 5,6,7 తేదీల్లో అన్నోజిగూడలో ఆర్ఎస్ఎస్ ఓ భారీ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు, సంచాలక్‌లు దీనికి హాజరు కానున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దీనికి సారథ్యాన్ని వహించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో జాతీయ స్థాయి నాయకులు పాల్గొననున్నారు.
జేపీ నడ్డా హైదరాబాద్‌కు రానున్ననందున.. బీజేపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలకడానికి సిద్ధం అయ్యారు. దీనికి సంబంధించిన సన్నాహాక కార్యక్రమాలపై బీజేపీ తెలంగాణ నేతలు- పార్టీ కేంద్ర కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. జేపీ నడ్డా నిర్వహించేు సమీక్షా సమావేశాల అజెండాను రూపొందించుకున్నారు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు, కరీంనగర్ లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్ చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించనున్నారు.
బండి సంజయ్ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటోన్నట్లు బీజేపీ నేతలు భావిస్తోన్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ బండి సంజయ్ దీక్ష చేపట్టారు. దీన్ని పోలీసులు భగ్నం చేశారు. రాత్రికి రాత్రి ఆయనను కరీంనగర్ నుంచి తరలించారు. ఆయనను హైదరాబాద్‌కు తీసుకొచ్చే అవకాశం ఉందంటూ వార్తలొస్తున్నాయి. ఈ దీక్ష ఉద్దేశాన్ని పార్టీ నాయకులు జేపీ నడ్డా దృష్టికి తీసుకెళ్లనున్నారు. మలి విడత పాదయాత్ర షెడ్యూల్‌ను కూడా ఖరారు చేస్తారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications