బీజేపీ నాలుగో జాబితా ప్రకటన.. మునుగోడు బరిలో ఆయనే!!
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికలకు అన్ని పార్టీలు ప్రచార పర్వాన్ని జోరుగా కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటనలో ముందు వరుసలో నిలిచిన బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో కూడా ముందుంది. గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి నియోజకవర్గాలలో పర్యటిస్తూ ప్రజా ఆశీర్వాద సభలను నిర్వహిస్తూ పెద్ద ఎత్తున ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తుంది. ఇక ప్రచారంలో కాస్త వెనుక పడ్డట్టు కనిపించిన బిజెపి అభ్యర్థుల ప్రకటనలు ఇంకా చేస్తూనే ఉంది. తాజాగా బిజెపి నాలుగో జాబితాను విడుదల చేసింది. బిజెపి నాలుగో జాబితా 12 మంది అభ్యర్థులతో విడుదల అయింది.

ఇప్పటివరకు నాలుగు జాబితాలలో 100 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. పొత్తులలో భాగంగా జనసేనకు 7 సీట్లు ఇవ్వనున్నారు. జనసేనతో చర్చల తర్వాత మిగిలిన స్థానాలకు కూడా బిజెపి తమ అభ్యర్థులను ప్రకటించనుంది. అయితే ప్రస్తుతం బిజెపి ప్రకటించిన నాలుగో జాబితా వివరాల్లోకి వెళితే ఈ జాబితాలో బిజెపి చెన్నూరు నియోజకవర్గానికి దుర్గం అశోక్, ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సుభాష్ రెడ్డి లను అభ్యర్థులుగా ప్రకటించింది.
హుస్నాబాద్ నియోజకవర్గానికి బొమ్మ శ్రీరాం చక్రవర్తి, సిద్దిపేట నియోజకవర్గానికి దూది శ్రీకాంత్ రెడ్డి, వికారాబాద్ నియోజకవర్గానికి పెద్దింటి నవీన్ కుమార్, కొడంగల్ నియోజకవర్గానికి బంటు రమేష్ కుమార్, గద్వాల్ నియోజకవర్గానికి బోయ శివ, మిర్యాలగూడ నియోజకవర్గానికి సాదినేని శివ, నకిరేకల్ కు మొగులయ్య, ములుగు అజ్మీరా ప్రహ్లాద్ నాయక్, వేములవాడ తుల ఉమ, మునుగోడు చల్లమల్ల కృష్ణారెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించింది.
దీంతో వీరంతా ప్రజాక్షేత్రంలో జోరుగా ప్రచార పర్వంలో దూకుడును కొనసాగించనున్నారు. ఇంకా కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అవి కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఏది ఏమైనా చివరి నిముషం వరకు బీజేపీ అభ్యర్థుల ప్రకటనలో చేస్తున్న జాప్యం పార్టీకి నష్టం చేసే అవకాశం ఉందన్న చర్చకు కారణం అవుతుంది.












Click it and Unblock the Notifications