రేవంత్ బాధ్యతల వేళ బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం..!!
తెలంగాణ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ సమయంలోనే బీజేపీ నాయకత్వం కీలక నిర్ణయానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. తాజా ఎన్నికల్లో బీజేపీ సీట్లు పెరిగాయి. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల పైన ఫోకస్ చేస్తోంది. అందులో భాగంగా కాంగ్రెస్..బీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్తోంది.
తెలంగాణలో పెరిగిన సీట్లు..ఓట్లు బీజేపీ నాయకత్వం ఆలోచన మార్చుతోంది. మరింత ప్రజాకర్షణ ఉన్న నాయకుడు..పక్కా వ్యూహాలతో ముందుకు వళ్తే ప్రజా మద్దతు లభిస్తుందని గుర్తించింది. హైదరాబాద్ లో కాంగ్రెస్ కు ఒక్క సీటు రాకపోవటం తో బీజేపీ ఆశలు పెరిగాయి. అదే సమయంలో త్రిముఖ పోటీలో బీజేపీ 8 స్థానాలు దక్కించుకుంది. మరి కొన్ని స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చింది. దీంతో..లోక్ సభ ఎన్నికల కోసం కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా బండి సంజయ్ ను తప్పించటం సరి కాదని..బండి అధ్యక్షుడిగా కొనసాగించి ఉంటే ఈ ఫలితాలు మరో విధంగా ఉండేవనే అభిప్రాయాలు పార్టీ నేతలకు చేరాయి. దీంతో..లోక్ సభ ఎన్నికల ముందు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరోసారి బండి సంజయ్ నియామక వ్యవహారం తెర మీదకు వచ్చింది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. తనకు బాధ్యతలు అప్పగించిన సమయంలోనే అసెంబ్లీ ఎన్నికల వరకే తాను కొనసాగుతానని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ గెలిచిన మూడు రాష్ట్రాల్లో సీఎంల నియామకం పైన పార్టీ నాయకత్వం బిజీగా ఉంది. ఆ తరువాత పార్టీ నాయకత్వాన్ని కలిసి పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలనే యోచనలో కిషన్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు హైకమాండ్ అనుమతిస్తే తిరిగి తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తిరిగి నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. లోక్ సభ ఎన్నికల్లో ఈ సారి దక్షిణాది రాష్ట్రాల పైన బీజేపీ నాయకత్వం ప్రత్యేకంగా కార్యాచరణ సిద్దం చేస్తోంది. అందులో భాగంగా తెలంగాణలో తిరిగి సంజయ్ కు నాయకత్వం అప్పగిస్తే కలిసి వస్తుందనే చర్చ పార్టీలో మొదలైంది.
కానీ, పార్టీ నాయకత్వం ఆలోచనల పైన భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికల వేళ మరోసారి నాయకత్వం మార్చితే కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందనే వాదన ఉంది. లోక్ సభ ఎన్నికల వరకు కిషన్ రెడ్డినే కొనసాగిస్తారని చెబుతున్నారు. కిషన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్కటి కూడా బీజేపీ గెలవలేదు. దీంతో..ముందుగా తన నియోజకవర్గంలో పరిస్థితి చక్కదిద్దుకోవాలని కిషన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్లో కిషన్ రెడ్డి కొనసాగేందుకు సుముఖంగా లేరని సమాచారం. దీంతో..ఇప్పుడు తెలంగాణలో పార్టీ అధ్యక్ష పదవి విషయంలో బీజేపీ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుటుందనేది ఆసక్తిగా మారుతోంది.












Click it and Unblock the Notifications