బిజెపి ఎంపీ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు: ఇద్దరం విలన్లుగా..: చిరంజీవి
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ తన మొదటి, చివరి పార్టీ అని బాలీవుడ్ నటుడు, ఆ పార్టీ అసంతృప్త నేత శతృఘ్ను సిన్హా బుధవారం అన్నారు. బుధవారం రాత్రి బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్లో ఆయన జీవిత చరిత్రతో కూడిన 'ఎనీథింగ్ బట్ ఖామోష్' పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది.
భారతీ ఎస్ ప్రధాన్ రచించిన ఈ పుస్తకాన్ని శతృఘ్న సిన్హాతో కలసి రాజ్యసభ సభ్యులు చిరంజీవి, సుబ్బరామిరెడ్డి, సినీనటులు మోహన్ బాబు, మోహన్ లాల్, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, ఓం పుస్తక పబ్లిషర్స్ డైరెక్టర్ అజయ్, రచయిత్రి అంజూ పొద్దార్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సిన్హా మాట్లాడారు. తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులున్నా ఒక లక్ష్యంతో ముందుకెళ్లానన్నారు. ఆ కారణంగానే సినీ పరిశ్రమ నుంచి కేంద్రమంత్రి పదవిని పొందే అవకాశాన్ని దక్కించుకున్నానన్నారు. తన సోదరులు ముగ్గురు వైద్యులేనన్నారు. తాను మాత్రం కాంపౌండర్‌ను కూడా కాలేకపోయనన్నారు.

అనుకోని విధంగా దేశానికే ఆరోగ్యశాఖ మంత్రినయ్యే అవకాశం దక్కిందన్నారు. జీవిత చరిత్ర రాసే సమయంలో కొందరు కుటుంబ సభ్యులు, స్నేహితులు తన నిర్ణయాన్ని విమర్శించారన్నారు.
అలాగే రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న సమయంలోనూ తన భార్య సోదరుడైన సుభాష్ ఘయ్ రాజకీయాలు అవసరమా? ఎందుకోసమని ప్రశ్నించారన్నారు. జీవితంలో ఒడిదుడుకులున్నా ఒక లక్ష్యంతో ముందుకెళ్లానని చెప్పారు.
టాలీవుడ్ నటుడు, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి మాట్లాడుతూ.. తామిద్దరి జీవితాలకు సామీప్యం ఉందన్నారు. ఇద్దరం ప్రతినాయకులుగానే సీనీ జీవితాన్ని ప్రారంభించి, హీరోలుగా మారామన్నారు. రాజకీయ ప్రస్థానం కూడా ఒకేలా ఉందన్నారు. మోహన్ బాబు మాట్లాడుతూ.. రజనీకాంత్, అంబరీష్, శతృఘ్న సిన్హాలతో తమకు దాదాపు నలభై ఏళ్ల అనుబంధం ఉందన్నారు.
యుక్తవయసులో ఉన్నప్పటి నుంచి శతృఘ్న సిన్హా నటనను ఎంతో అభిమానించేవాళ్లమని మార్గదర్శి ఎండి శైలజా కిరణ్ అన్నారు. ఆయన ఆహార్యం దక్షిణాది నటుడిగానే కనిపించడం వల్ల ఎక్కువగా ఇష్టపడటానికి ఓ కారణం కావచ్చన్నారు. తన జీవిత చరిత్ర పుస్తకంలోని ఒక అధ్యాయంలో 'రాజకీయాలు ఫిజిక్స్ కంటే కష్టమైనవ'ని శతృఘ్న సిన్హా పేర్కొనడం ఎంతో అద్భుతమైన విషయమన్నారు.












Click it and Unblock the Notifications