బీజేపీ బహిరంగసభకు అనుమతివ్వాలని హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్; కొనసాగుతున్న టెన్షన్!!
వరంగల్లో ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించనున్న బిజెపి బహిరంగ సభకు అనుమతి లేదని తాజాగా బిజెపి నేతలకు కళాశాల యాజమాన్యం షాక్ ఇవ్వడంతో, బిజెపి మళ్లీ బహిరంగ సభ నిర్వహణ కోసం కోర్టును ఆశ్రయించింది. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి, అత్యవసరంగా దీనిని విచారించాలని, సభ నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని బిజెపి తమ పిటిషన్ ద్వారా కోర్టును అభ్యర్థించింది.

పాదయాత్రకు కోర్టు నుండి అనుమతి పొందిన బీజేపీ
తెలంగాణ రాష్ట్రంలో రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలతో ఒకపక్క మత విద్వేషాలు చోటు చేసుకుంటే, మరోపక్క బీజేపీ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర రాజకీయంగా వాతావరణం వేడెక్కిస్తోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనసాగుతున్న నేపథ్యంలో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయని, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు నోటీసులు జారీ చేస్తే, కోర్టును ఆశ్రయించిన బిజెపి పాదయాత్ర నిర్వహించుకోవడానికి కోర్టు నుంచి అనుమతి పొందింది.

బీజేపీ సభకు అనుమతి నిరాకరించిన కాలేజ్ యాజమాన్యం.. హైకోర్టు మెట్లెక్కిన బీజేపీ
బ్రేక్ పడిన పాదయాత్రను యధావిధిగా కొనసాగించాలని, అలాగే 27వ తేదీన హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభను సక్సెస్ చేయాలని బిజెపి భావిస్తుంటే, బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో, ఆర్ట్స్ కళాశాల మైదానంలో బహిరంగ సభను నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వలేమని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ బన్న ఐలయ్య బిజెపి శ్రేణులకు వెల్లడించారు. దీంతో ఆర్ట్స్ కళాశాల మైదానంలో సభ నిర్వహణకు అనుమతి లేకపోవడంతో దీనిపై బిజెపి టిఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ చేస్తుంది.

సభకు అనుమతి కోసం లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసిన బీజేపీ..
ఎలాగైనా సభ నిర్వహించి తీరుతామని చెప్పిన బిజెపి ఆర్ట్స్ కళాశాలలో బహిరంగ సభ నిర్వహణకు మళ్లీ హై కోర్టు మెట్లెక్కింది. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ శ్రేణులు, తాము సభ ఏర్పాటు చేయకుండా అనుమతి నిరాకరిస్తున్నారని ఈ పిటిషన్లో పేర్కొన్నారు. శనివారం నిర్వహించే సభకు బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రానున్నారని, ఈ క్రమంలో తాము సభను నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని వారు పిటిషన్లో పేర్కొన్నారు.

బీజేపీ పిటీషన్ ను విచారించనున్న హైకోర్టు.. అందరిలోనూ టెన్షన్
బిజెపి బహిరంగ సభ అనుమతి కోసం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు నేడు పిటిషన్ ను విచారించనుంది. జస్టిస్ వినోద్ కుమార్ బెంచ్, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు పిటిషన్ ను విచారించనుంది. దీంతో అనుమతి లభిస్తుందా లేదా అన్న టెన్షన్ ప్రస్తుతం కనిపిస్తుంది. నిన్నటికి నిన్న పాదయాత్ర విషయంలో కోర్టును ఆశ్రయించిన బిజెపి నాయకులు తాజాగా, వరంగల్లో నిర్వహించాలనుకుంటున్న సభ విషయంలో కోర్టును ఆశ్రయించారు. కోర్టు అనుమతితో సభ నిర్వహిస్తామని బిజెపి నేతలు తేల్చి చెబుతున్నారు.












Click it and Unblock the Notifications