ప్లాన్ ప్రకారం బీజేపీ పావులు?: తెలంగాణలో టీడీపీ పని అయిపోయినట్లేనా?
హైదరాబాద్: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎదిగేందుకు కొత్త స్ట్రాటజీని అవలంభిస్తోందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్రమ క్రమంగా కనుమరుగవుతున్న నేపథ్యంలో టీడీపీ స్థానాన్ని తాము ఆక్రమించుకోవాలని ఆ దిశగా పావులు కదుపుతోంది.
మొన్నటి వరకు మహారాష్ట్రలో శివసేనకు తోకపార్టీలా ఉన్న బీజేపీ ఇప్పుడు ఆ పార్టీని తోక పార్టీలా మార్చుకుంది. మహారాష్ట్ర గడ్డపై బీజేపీ పతాకాన్ని ఎగురవేసింది. దీనికి ప్రధాని మోడీ మేనియా అసలు కారణం. అయితే బీజేపీ స్ట్రాటజిక్ ప్లాన్ అన్ని రాష్ట్రాల్లో సక్సెస్ కాలేక పోయినా పార్టీ విస్తరణకు మాత్రం దోహదపడుతోంది.

ఉత్తర భారతదేశంలో బీజేపీ హవా కొనసాగిస్తున్నప్పటికీ... చాలాకాలంగా కర్నాటక, తెలంగాణ మినహా దక్షిణ భారతదేశంలో ఇతర రాష్ర్టాల్లో అడుగుపెడదామని ప్రయత్నించినా అవి అంతగా సఫలం కాలేకపోయాయి. ఇందులో భాగంగా కాస్తో కూస్తో బలమున్న తెలంగాణలో ఇంతకాలం టీడీపీతో చేతులు కలిపి గెలుస్తోంది.
అయితే, ఇలా ఎంతకాలం? ఎన్నిరోజులని టీడీపీ చేయి పట్టుకుని నడవాలి? అనే భావన బీజేపీలో వచ్చింది. ఓటుకు నోటు కేసు, పార్టీ ఫిరాయింపులు, అంతర్గత కలహాలతో తెలంగాణలో టీడీపీ కొట్టుమిట్టాడుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మనకంటూ బలం పుంజుకోవాల్సిన సమయమిదేనని బీజేపీ భావిస్తోంది.
కేంద్రంలో కూడా బీజేపీ అధికారంలో ఉండటం బీజేపీకి కలిసొచ్చే అంశం. ఇందులో భాగంగానే సెప్టెంబరు 17 తేదీని తెలంగాణ విమోచనం అధికారికంగా జరపాలంటూ హడావుడి చేశారు. తెలుగుదేశం స్తబ్దుగా ఉంటున్న ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే తమ పార్టీ శ్రేణులను బలోపేతం చేసుకోవచ్చన్న ఆలోచనతో పార్టీ జాతీయ అధ్యక్షుడి చేత హన్మకొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది.
ఈ బహిరంగ సభ వల్ల బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. తెలంగాణ విమోచన దినోత్సవం ద్వారా హిందూ-ముస్లింల మధ్య చిచ్చుపెడుతున్నారన్న విమర్శలను ఏమాత్ర పట్టించుకోకుండా బీజేపీ మొండిగా ముందుకుపోతోంది. ఇలానే రాబోయే రోజుల్లో బీజేపీ తన దూకుడుని ప్రదర్శిస్తే బీజేపీకి తోకపార్టీగా టీడీపీ మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.












Click it and Unblock the Notifications