రీసెర్చ్ చేసి మరీ దోపిడీ: రేవంత్ సర్కారుపై మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు
సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన మహేశ్వర్ రెడ్డి రేవంత్ సర్కారుపై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోవాలో రీసెర్చ్ చేసి మరీ సీఎం రేవంత్ రెడ్డి దోపిడీ చేస్తున్నారన్నారు.
ముఖ్యంమంత్రి పీఠంపై కన్నేసి మాయమాటలతో గద్దెనెక్కి, ఆ మరుక్షణం నుంచే దోపిడీ ప్రారంభించారని రేవంత్ రెడ్డిపై మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.ఆర్ఆర్ ట్యాక్స్ కోసం జీవోలను గంటగంటకు మార్చి ఇచ్చారని విమర్శించారు. సంవత్సరానికి రూ.40వేల కోట్లు ఎట్లా దోచుకోవాలో ముందే రీసెర్చ్ చేసి పెట్టుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్‌తో వేల కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మూర్ఖత్వంతోనే రేవంత్ రెడ్డి రిజర్వేషన్లపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మెగా కృష్ణారెడ్డికి, రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధం బయట పెడుతానని చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, ఇప్పుడు సెటిల్మెంట్ ఇమేజ్ అయ్యిందని ఎద్దేవా చేశారు.
సెటిల్మెంట్ ఇమేజ్‌తో వేల కోట్ల ప్రాజెక్టులు మందగిస్తున్నాయని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, అసమర్ధత కాదా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో కిస్తి కట్టాలని రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఆరోపించారు.
డబుల్ ఆర్ ట్యాక్సీకి బిల్లులు ఉండవన్నారు. వేల కోట్ల రూపాయలు బిల్డర్స్ నుంచి వసూలు చేసి పావుల ఢిల్లీకి బారానా రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకుంటున్నారు మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు, గత ప్రభుత్వంపైనా విమర్వలు చేశారు. కేసీఆర్, కేటీఆర్ బిల్డర్స్ వద్ద ప్లోర్స్ తీసుకున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications