బీజేపీ ఆపరేషన్ అమరావతి వయా తెలంగాణ..!!
బీజేపీ పక్క వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. జమిలి ఎన్నికల దిశగా కసరత్తు చేస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల పైన గురి పెట్టింది. దక్షిణాదిన బీజేపీ ప్రస్తుతం సొంతంగా ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేదు. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో కొనసాగుతోంది. దీంతో, జమిలికి ముందే తమ తాజా వ్యూహాలకు కార్యాచరణ ప్రారంభించింది. బీజేపీ తీసుకున్న తాజా నిర్ణయం వెనుక ఆసక్తి కర సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి.
బీజేపీ కొత్త ప్లాన్
బీజేపీ జమిలి ఎన్నికల దిశగా కసరత్తు చేస్తూనే.. కొత్త వ్యూహలు తెర మీదకు తెస్తోంది. జమిలికి వెళ్తే దక్షిణాది నుంచి సీట్లు పెంచుకునే ఎత్తుగడలు ప్రారంభించింది. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండటంతో.. తెలంగాణలోనూ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సామాజిక సమీకరణాలు కీలకం కావటంతో..ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా బీజేపీ నుంచి బీసీ నేత ఆర్ క్రిష్ణయ్యకు రాజ్యసభ సీటు ఇవ్వటం వెనుక భారీ వ్యూహం కనిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎస్సీ వర్గీకరణ ..బీసీ ముఖ్యమంత్రి నినాదంతో బీజేపీ ఓటింగ్ శాతం..సీట్లు పెంచుకుంది.

తెలుగు రాష్ట్రాల పై గురి
దీంతో, తెలుగు రాష్ట్రాల్లో బీసీ ఓటింగ్ పైన పట్టు సాధించేందుకు క్రిష్ణయ్య కు రాజ్యసభ సీటు కేటాయించినట్లు స్పష్టం అవుతోంది. తెలంగాణలో కొత్తగా బీజేపీ అధ్యక్షుడిగానూ బీసీ నేతకే అవకాశం ఇవ్వనున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. తెలంగాణలో ఇప్పటికే బీజేపీ నుంచి పలువురు బీసీ నేతలు ఎంపీలుగా ఉన్నారు. ఓబీసీ విభాగం అధ్యక్ష బాధ్యతలు తెలంగాణ నేతకే అప్పగిం చారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బలం చాటాలనే లక్ష్యంతో బీజేపీ అడుగులు వేస్తోంది. ఇటు ఏపీలో టీడీపీ - జనసేన మద్దతు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో.. హైదరాబాద్ లోనూ ఆ రెండు పార్టీల మద్దతు కలిసి వస్తుందని అంచనా వేస్తోంది.
పొత్తులు - బలోపేతం
ఇందు కోసం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఏపీలోని మూడు పార్టీల కూటమి కలిసి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. మూడో సారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత మోదీ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకించి ఏపీ విషయంలో సానుకూలంగా స్పందిస్తోంది. ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు కారణంగా ఆ రెండు పార్టీలకు మద్దతుగా నిలుస్తున్న రెండు ప్రధాన సామాజిక వర్గాల మద్దతు పరోక్షంగా ఉండటంతో.. ఇప్పుడు బీసీ వర్గాల పైన గురి పెట్టింది. అందులో భాగంగా ఏపీకి సైతం బీసీ వర్గానికి చెందిన నేతనే ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగిస్తారని సమాచారం. భవిష్యత్ రాజకీయాల్లో పొత్తులో ఉంటూనే.. సొంతంగా ఎదగటం పైన బీజేపీ ఫోకస్ చేసింది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో మరిన్ని ఆసక్తికర నిర్ణయాలు ఉండే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications