బండి సంజయ్ దీక్ష భగ్నం: అరెస్ట్, కరీంనగర్‌లో ఉద్రిక్తత, పీఎస్‌లోనే కొనసాగుతున్న దీక్ష
కరీంనగర్: నాటకీయ పరిణామాల మధ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ జనజాగరణ దీక్ష భగ్నం చేశారు పోలీసులు. బండి సంజయ్‌ని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అడ్డుకున్న కార్యకర్తలపై నిర్దాక్షిణ్యంగా లాఠీలు ఝుళిపించారు పోలీసులు. ఆ తర్వాత బండి సంజయ్‌ను తీసుకెళ్లి వ్యాన్ ఎక్కించారు పోలీసులు. దీంతో బండి సంజయ్ కార్యాలయంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
అంతకుముందు ఆఫీస్ తలుపులు పగులగొట్టి లోపలికెళ్లిన పోలీసులు బండి సంజయ్‌ని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పొగతో కమ్ముకుంది ఎంపీ కార్యాలయం. గునపాలతో గేట్లు కూలుస్తుండగా లోపలి నుంచి అడ్డుకున్నారు బీజేపీ కార్యకర్తలు. పోలీసులు లోపలికి రాకుండా కార్యాలయ ద్వారానికి కుర్చీలు అడ్డుపెట్టి వలయంగా నిలబడ్డా కార్యకర్తలు. అయినా పోలీసులు లోపలికి ప్రవేశించారు.

అంతకుముందు జరిగిన పరిణామాలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్‌లో చేపట్టిన జాగరణ దీక్ష దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీక్షా శిబిరం దగ్గర పోలీసులు-బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో కరీంనగర్ ఎంపీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత ఏర్పడింది.
317 జీవోను సవరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు సంఘీభావంగా కరీంనగర్‌లో ఆదివారం రాత్రి ఎంపీ క్యాంపు కార్యాలయం వద్ద దీక్షకు సిద్ధమయ్యారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో అనుమతి లేకపోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు.. పోలీసులు, సీఎం కేసీఆర్, కేటీఆర్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ క్రమంలోనే ఎంపీ బండి సంజయ్ బైక్‌పై క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో పోలీసులు సంజయ్‌ను చుట్టుముట్టారు. పోలీసుల వలయాన్ని ఛేదించుకుని ఆయన కార్యాలయంలోనికి వెళ్లారు. ప్రస్తుతం కార్యాలయం ప్రాంగణంలో భారీగా పోలీసులు, బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. కార్యాలయంలోనికి పోలీసులు ప్రయత్నంచే క్రమంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ సందర్బంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు దీక్షను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. నల్గొండలో సీఎం కేసీఆర్ సభకు అనుమతించిన పోలీసులు తమకు ఎందుకు ఇవ్వడం లేదని సంజయ్ ప్రశ్నించారు. 317 జీవో వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతోందని, సొంత జిల్లాలో కూడా పరాయి వాడిగా ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. జీవోను సవరించి, అందుకు అనుగుణంగా బదిలీ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. ఉపాధ్యాయులకు న్యాయం జరిగేవరకు ఊరుకునే ప్రసక్తే లేదని, ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా దీక్ష కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.
కాగా, బండి సంజయ్ ఎంపీ కార్యాలయంలో దీక్ష కొనసాగిస్తున్నారు. పోలీసులు భారీగా మోహరించారు. పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. బండి సంజయ్ ను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. బండి సంజయ్ జాగరణ దీక్షకు ఎలాంటి అనుమతి కోరలేదని కరీంనగర్ సీపీ తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేనందున మీడియా కవరేజ్ ఇవ్వొద్దని సీపీ వెల్లడించారు.












Click it and Unblock the Notifications