జాతీయ రాజకీయాల్లోకి వెళ్దామా ? అంటూ కేసీఆర్: బీజేపీ ముక్త భారత్‌కు పిలుపు
పెద్దపల్లి: దేశంలో త్వరలోనే రైతు ప్రభుత్వం రాబోతోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పెద్దపల్లిలో సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడ్డాక కలలో కూడా ఊహించని అనేక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు.

బీజేపీ ముక్త భారత్ కోసం సిద్ధం కావాలంటూ కేసీఆర్ పిలుపు
ఈ సందర్భంగా ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో దేశంలో బీజేపీని పారద్రోలి రైతు ప్రభుత్వం రాబోతోందన్నారు. దేశంలో రైతులు సాగుకు వాడే విద్యుత్ కేవలం 20.8 శాతమేనని, దీనికి అయ్యే ఖర్చు రూ. 1.45 లక్షల కోట్లు మాత్రమేనని చెప్పారు. ఇది కార్పొరేట్ దొంగలకు దోచిపెట్టినంత సొమ్ము కూడా కాదని అన్నారు. రైతులకు ఇవ్వడానికి మాత్రం కేంద్రానికి చేతులు రావడం లేదన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ కుట్రను భగ్నం చేయాలన్నారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం అందరూ సన్నద్ధం కావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
జాతీయ రాజకీయాల్లోకి రమ్మంటున్నారని కేసీఆర్
ఇటీవల 26 రాష్ట్రాల నుంచి రైతు సంఘాల నేతలు వచ్చి తనను కలిశారని.. జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరారని కేసీఆర్ చెప్పారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్దామా? అని సభను హాజరైనవారిని ప్రశ్నించారు. గుజరాత్ మోడల్ అని మోసం చేశారని.. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు అడ్డగోలుగా పెంచారని మండిపడ్డారు. మద్యపానం నిషేధం విదించిన రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారిందని, 70 మంది మృతి చెందారన్నారు. వారికి మృతికి కేంద్రం జవాబు చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వం దోపిడీ చేస్తోందని మండిపడ్డారు.
చెప్పులు మోసే వెధవలంటూ కేసీఆర్ ఫైర్
ఇక్కడున్నవారిని గులాములు చేసుకుని.. బూట్లు, చెప్పులు మోసే వెధవలు కూడా ఇష్టమున్నట్లు కూతలు కూస్తూ సమాజాన్ని కలుషితం చేసే పనిచేస్తున్నారని పరోక్షంగా బీజేపీ నేతలపై మండిపడ్డారు కేసీఆర్. శ్రీలంకలో ఇండియన్ పీఎం గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారని చెప్పారు. ఇక, పెద్దపల్లిలో ప్రతి గ్రామ పంచాయతీకి నిధులు అందుతాయన్నారు.
గ్రామ పంచాయతీలకు రూ. 10 లక్షల చొప్పున నిధులు కేటాయించినట్లు తెలిపారు. రామగుండం కార్పొరేషన్ కు రూ. కోటి మంజూరు చేసినట్లు చెప్పారు. మూడు మున్సిపాలిటీలకు రూ.కోటి చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. అంతకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి జిల్లాలో రూ. 48 కోట్లతో నిర్మించిన సమీకృత కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించారు.
పెద్దపల్లి శివారులోని పెద్దబొంకూరు వద్ద 21 ఎకరాల సువిశాల విస్తీర్ణ స్థలంలో నిర్మించిన కార్యాలయాల సముదాయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications