బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర-2కు రంగం సిద్ధం.. మళ్ళీ జనంలోకి బండి సంజయ్.. టార్గెట్ అదే!!
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీపై సమర శంఖం పూరించడానికి, ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని, ప్రజల అభిమానాన్ని పొందడానికి ప్రతిపక్ష పార్టీలు రంగంలోకి దిగాయి. పాదయాత్రల పేరుతో ప్రజాక్షేత్రంలో కేసీఆర్ సర్కార్ తీరును ఎండగడుతున్నాయి . ఇప్పటికే రెండో దఫా ప్రజా ప్రస్థానం పాదయాత్రను వైఎస్ షర్మిల ప్రారంభించి నల్గొండ జిల్లాలో నిర్వహిస్తున్నారు. కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. మరోవైపు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో మళ్ళీ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా మరోమారు ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడతకు శ్రీకారం చుట్టారు.

రెండో విడత ప్రజా సంగ్రామ పాదయాత్రకు బండి సంజయ్
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ని గద్దె దించడానికి ప్రతిపక్ష పార్టీలు జోరుగా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. తెలంగాణ బిజెపి రథసారథి గా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతూనే ఉన్నాడు. ఇక కేసీఆర్ కూడా బీజేపీనే ప్రధానంగా టార్గెట్ చేస్తూ ఢిల్లీ నుండి గల్లీ దాకా కేంద్రంపై పోరుకు శ్రీకారం చుట్టారు. ఇక ఇదే సమయంలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి బీజేపీని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని, కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయం తీసుకున్న బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర చేపట్టనున్నారు.
2024 ఎన్నికలే లక్ష్యంగా బండి సంజయ్ దూకుడు
బండి సంజయ్ ఆగస్ట్ 28 వ తేదీన చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి పాదయాత్ర ప్రారంభించి, నాలుగు ఐదు విడతలుగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మొదటి విడత హుస్నాబాద్ లో ముగిసింది. 2024 ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా పాదయాత్రలో మొదటి విడత పూర్తి చేసుకున్న బండి సంజయ్ ఇప్పుడు మళ్ళీ రెండో విడతకు శ్రీకారం చుట్టారు. మొదటి విడత పాదయాత్ర రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో జరగగా,రెండో విడత పాదయాత్రకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు.

ఏప్రిల్ 14 నుండి ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత ప్రారంభం
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండవ దశ ఏప్రిల్ 14 వ తేదీన మొదలుకానున్నట్టు బిజెపి వెల్లడించింది. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఆలంపూర్ జోగులాంబ శక్తిపీఠం వేదికగా మొదలు కానుంది. కెసిఆర్ ప్రభుత్వ వైఫల్యాలను రాష్ట్రం నలుమూలల ప్రజలకు చేరవేయడం కోసం ప్రజా సంగ్రామ యాత్రను నిర్వహిస్తున్న బండి సంజయ్ మొదటి విడత పాదయాత్రలో 438 కిలోమీటర్ల మేర నడిచారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటు, టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టారు.

రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్న బీజేపీ శ్రేణులు .. జాతీయ నాయకుల భాగస్వామ్యం
కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన నిధులను గురించి ప్రజలకు వివరిస్తూనే, కేంద్రం ఇచ్చిన తెలంగాణ ఉపయోగించుకోవడం లేదంటూ తెలంగాణ సర్కారు తీరుపై మండిపడ్డారు. మొత్తం 18 అసెంబ్లీ, ఆరు పార్లమెంట్ నియోజకవర్గాల తో పాటు 8 జిల్లాలను ప్రజా సంగ్రామయాత్ర ద్వారా బండి సంజయ్ కవర్ చేస్తూ మొత్తం 34 సభలు నిర్వహించారు. ఇక ఏప్రిల్ 14వ తేదీన నిర్వహించనున్న రెండవదశ ప్రజా సంగ్రామ యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ ను సిద్ధం చేసే పనిలో బీజేపీ నేతలు ఉన్నారు. ఈ యాత్రలోనూ జాతీయ నాయకులను భాగస్వామ్యం చెయ్యాలని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications