ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తే: కిషన్ రెడ్డి, నోటిఫికేషన్ వచ్చాకే అభ్యర్ధుల ఎంపిక: ఉత్తమ్
హైదరాబాద్: కేంద్రం నుంచి లక్ష కోట్ల ప్యాకేజీ తేవాలని మంత్రి కేటీఆర్ అంటున్నారని, అయితే ఇప్పటికే అంతకంటే ఎక్కువ నిధులే తెచ్చామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం మంజూరు చేసిన నిధులపై బీజేపీ చర్చకు సిద్ధంగా ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వం సాయం లేకుండా సంక్షేమ పథకాల అమలు చేయడం అసాధ్యమన్నారు. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ నేతలుక పూనకం వస్తుందని అన్న కిషన్ రెడ్డి టీఆర్ఎస్ నేతలు బీజేపీని ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు.
ఏ హోదాతో ముఖ్యమంత్రి కుమారుడు హౌసింగ్ స్కీంలకు శంకుస్థాపన చేస్తున్నాడని ఆయన విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల్లో ఓట్ల కోసమే టీఆర్‌ఎస్ నేతలు బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. మన హైదరాబాద్, మన మేయర్, మన బీజేపీనే తమ ఎన్నికల నినాదమని ఆయన చెప్పారు.
నోటిఫికేషన్ వచ్చాకనే అభ్యర్ధుల ఎంపిక: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్

జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాకనే అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రేటర్ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు.
జనవరి 3వ(ఆదివారం) తేదీన గాంధీభవన్‌లో 24 నియోజకవర్గాల నేతలు, డివిజన్ కమిటీ నాయకులతో సమావేశమవుతారని ఆయన చెప్పారు. 5,6 తేదీల్లో నియోజకవర్గ, డివిజన్ స్థాయి సమావేశాలు ఉంటాయని, 4న ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకుంటామన్నారు.
ఈ నెల 7 నుంచి ఇంటింటి ప్రచార కార్యక్రమం చేపడతామని ఆయన వెల్లడించారు. తమతో కలిసి వచ్చే పార్టీలతో చర్చలకు సిద్ధమని ప్రకటించారు. 12 శాతం రిజర్వేషన్లు ఏమయ్యాయో ముస్లింలు గమనించాలని ఈ సందర్భంగా ఉత్తమ్ సూచించారు. ఓటర్లను ఆకట్టుకోవడం కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం పన్ను రాయితీలు ప్రకటించిందన్నారు.












Click it and Unblock the Notifications