కవిత పార్టీపై లైట్ తీసుకుంటున్నారు గానీ
తెలంగాణ రాజకీయ తెరపై మరో నూతన పార్టీ ఆవిష్కృతమైంది. ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ పార్టీని నెలకొల్పారు. బీఆర్ఎస్ తర్వాత ఆ స్థాయిలో ప్రాంతీయ పార్టీ అంటూ పెద్దగా ఏదీ లేకపోవడంతో.. కవిత ఆ లోటును భర్తీ చేస్తారనే అంచనాలు ఉన్నాయి. ఈ ఉదయం 10 గంటలకు మెదక్-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ సందర్భంగా పార్టీ పేరును ప్రకటించారు.
ఈ పార్టీపై అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. తొలుత భారత్ రాష్ట్ర సమితి సెటైర్లు సంధించింది. టీఆర్ఎస్ ను డూప్లికేట్ పార్టీగా అభివర్ణించింది. ఒరిజినల్ ఒరిజినలేనని, డూప్లికేట్ డూప్లికేటేనని చురకలు అంటించింది. బీఆర్ఎస్ కు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఈ టీఆర్ఎస్ ను వైఎస్ షర్మిల గతంలో నెలకొల్పిన వైఎస్ఆర్టీపీతో పోల్చుతున్నారు. టీఆర్ఎస్ కూడా ఏదో ఒక పార్టీలో విలనమౌతుందనీ జోస్యం చెబుతున్నారు.

తాజాగా కవిత పార్టీపై బీజేపీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు స్పందించారు. టీఆర్ఎస్ ను లైట్ గా తీసుకున్నారు. టీఆర్ఎస్ ను కేఏ పాల్ కు చెందిన ప్రజాశాంతి పార్టీతో పోల్చారు. కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారని, ఆయన ఏం సాధించారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ కూడా అంతేనని పేర్కొన్నారు. ఏ పార్టీ నిజంగా తమ గురించి ఆలోచిస్తుందో, సమాజ శ్రేయస్సు కోసం పని చేస్తుందో ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.
గతంలో టీఆర్ఎస్.. ఇప్పుడు బీఆర్ఎస్.. పుట్టబోయే బిడ్డ పేరు మళ్లీ టీఆర్ఎస్ అంటూ రాంచందర్ రావు సెటైర్లు వేశారు. ఎన్ని పార్టీలు వచ్చినా బీజేపీకి ఇబ్బంది లేదని, తెలంగాణలో తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడారు. అసలు కవితను తామెప్పుడో మర్చిపోయామని, ఇక ఆమె పెట్టిన పార్టీ గురించి ఆలోచించట్లేదని అన్నారు. మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాల్లో పిట్టలదొర క్యారెక్టర్ల చూశామని, ఇక పిట్టల దొరసాని క్యారెక్టర్ చూస్తామని ఎద్దేవా చేశారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన 'దీన్ దయాళ్ ప్రశిక్షణ్ అభియాన్' జిల్లా స్థాయి వర్క్‌షాప్‌ను రాంచందర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ధర్మపురి అరవింద్ తో పాటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, గౌతమ్ రావు తదితరులు హాజరయ్యారు. తెలంగాణలో రాజకీయ పవనాలు వేగంగా మారుతున్నాయి. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ఏకైక బలమైన ప్రత్యామ్నాయ శక్తి ఒక్క బీజేపీ మాత్రమే నిలుస్తుందని అన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ స్థాపనే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications