వరల్డ్ రికార్డు కైవసం చేసుకున్న బతుకమ్మ
తెలంగాణలో బతుకమ్మ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఊరూవాడా, పల్లెలు బతుకమ్మ సంబరాల్లో మునిగి తేలుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. యువతులు, మహిళలంతా బతుకమ్మల చుట్టూ చేరి ఆటపాటలతో వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పెద్దపల్లి, కామారెడ్డి, నల్గొండ, వరంగల్ లో ఘనంగా సంబరాలు నిర్వహిస్తున్నారు. పలు చోట్ల డీజేలను కూడా ఏర్పాటు చేశారు.
అయితే తాజాగా హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో బతుకమ్మ వేడుకల్లో 2 గిన్నిస్ రికార్డులు నమోదయ్యాయి. మైదానంలో ఏర్పాటు చేసిన 63 అడుగుల ఎత్తు, 11 అడుగుల వెడల్పు, 7 టన్నుల బరువైన భారీ బతుకమ్మ చుట్టూ 1,354 మంది మహిళలు సంప్రదాయ దుస్తుల్లో లయబద్ధంగా ఆడిపాడారు. భారీ బతుకమ్మతోపాటుగా అతిపెద్ద జానపద నృత్యంగా పేర్కొంటూ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి చేరుస్తూ తాజాగా అధికారులు ప్రకటన చేశారు. అలాగే మంత్రి సీతక్క బతుకమ్మ పాట పాడి అలరించారు.

మరోవైపు హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో అత్యంత వైభవంగా నిర్వహించిన మెగా బతుకమ్మ వేడుకల్లో రాష్ట్ర పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. 'గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధనకు కృషి చేసిన ప్రతీ ఒక్కరికి మంత్రి అభినందనలు, శుభాకాంక్షలు. ప్రతి ఇంట్లో, ప్రతి ఊరిలో బతుకమ్మ పండుగ వెలుగులు నింపాలి. ఈ పండుగ మనందరికి సంతోషం, ఐక్యత, సౌభ్రాతృత్వం అందించాలి. రాష్ట్ర ప్రజలను సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో దీవించాలని ప్రకృతి దేవత బతుకమ్మను ప్రార్థిస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు' అని తెలిపారు.












Click it and Unblock the Notifications