దేశానికి ప్రధానులు మారినా కష్టాలు తీరలేదు: మార్పు కోసమే బీఆర్ఎస్: కేసీఆర్
తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో బహిరంగ సభలో కేంద్ర ప్రభుత్వ తీరు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో సంపన్నులు మరింత సంపన్నులు అవుతున్నారని, పేదలు మరింత పేదరికంలో కూరుకు పోతున్నారని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో అధిక జనాభా ఉన్న దేశం భారతదేశం అని పేర్కొన్న ఆయన దేశంలో మౌలిక సదుపాయాలు లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయన్నారు. దేశం పురోగమిస్తుందో.. తిరోగమిస్తుందో ఒకసారి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో పరివర్తన రావాల్సిన అవసరం ఉందని, మార్పు జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్న ఆయన ఒక పార్టీ గెలిస్తే మరో పార్టీ ఓడిపోవడం పరివర్తన కాదని, ఎవరు గెలిచినా సమస్య అపరిష్కృతంగానే ఉందని పేర్కొన్నారు.

ఎంత త్వరగా మేలుకుంటే అంత త్వరగా బాగుపడతామని పేర్కొన్న కెసిఆర్ దేశంలో ఎందరో ప్రధానులు మారినా రైతుల కష్టాలు, ప్రజల కష్టాలు తీర్చలేదని అసహనం వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో 770మంది రైతులు చనిపోవడం ప్రజాస్వామ్యమా అంటూ ప్రశ్నించారు. రైతుల మరణాలు ప్రభుత్వానికి పట్టవా అంటూ నిలదీశారు. పార్టీలు గెలవడం ముఖ్యం కాదని ప్రజల ఆకాంక్షలు గెలవడం ముఖ్యమని పేర్కొన్న ఆయన దేశప్రజల కోసం పోరాడటానికి బీఆర్ఎస్ ముందుకు వచ్చిందన్నారు.
దేశంలో మార్పు జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. త్వరలోనే బీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో అనేక నదులు ఉన్నాయని, ఇప్పటికీ తాగునీరు లభించక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్న కెసిఆర్ మహారాష్ట్రలో అధికారంలోకి వస్తే ఐదేళ్లలోనే ఇంటింటికి సురక్షిత తాగునీరు అందిస్తామన్నారు. మహారాష్ట్ర అడుగడుగునా నిర్లక్ష్యానికి గురవుతుందని అన్నారు.












Click it and Unblock the Notifications