మాజీ మంత్రితో అరికెపూడి గాంధీకి బీఆర్ఎస్ చెక్..!!
తెలంగాణ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచిన పలువురు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వారి పైన అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీ నేతలు కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే కోర్టు దీని పైన ఆదేశాలు ఇచ్చింది. అదే సమయంలో పార్టీ వీడిన వారి నియోజకవర్గాల్లో కొత్త నాయకత్వం సిద్దం చేసేందుకు కేసీఆర్ సిద్దమయ్యారు. అందులో భాగంగా అరికెపూడి గాంధీ నియోజకవర్గం లో పాగా వేసేందుకు బీఆర్ఎస్ మాజీ మంత్రి ప్రయత్నాలు ప్రారంభించారు.
మారుతున్న లెక్కలు
బీఆర్ఎస్ నుంచి గెలిచిన అరికెపూడి గాంధీ తాజాగా కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. కొద్ది రోజుల క్రితం కౌశిక్ రెడ్డి ఇంటి పైన దాడి వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు కారణమయ్యారు. శేరిలింగంపల్లిలో సమీకరణాలు గాంధీకి ఎన్నికల్లో కలిసి వచ్చాయి. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ గ్రేటర్ లో మాత్రం పట్టు నిలబెట్టుకుంది. ఇక..గ్రేటర్ లో తమకు ఉన్న బలం కొనసాగేలా బీఆర్ఎస్ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది. అందులో భాగంగా గాంధీ పార్టీని వీడటంతో శేరిలింగంపల్లి నుంచి రంగంలోకి దిగేందుకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది.

గాంధీ స్థానంలో
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పువ్వాడ అజయ్ ఖమ్మం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మంత్రి తుమ్మల అక్కడ విజయం సాధించారు. సామాజిక సమీకరణాలు...ఓటింగ్ అంశాలను పరిగణలోకి తీసుకుంటే శేరిలింగంపల్లి తనకు కలిసి వస్తుందని అజయ్ అంచాన వేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అక్కడ పెద్ద సంఖ్యలో సెటిలర్ల ఓట్లు ఉన్నాయి. నియోజకవర్గంలో కమ్మ వర్గం ఓటింగ్ సైతం ఎక్కువగా ఉంది. అరికెపూడి గాంధీ పార్టీ మారడంతో ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని పువ్వాడ భావిస్తున్నారని సమాచారం. బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయమని పువ్వాడ భావిస్తున్నారు.
ఖమ్మం వీడుతారా
దీంతో..వచ్చే ఎన్నికల నాటికి శేరిలింగంపల్లిలో బలపడేలా తాను అక్కడ పని చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని అజయ్ పార్టీ నాయకత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. కానీ, ఖమ్మంలో పువ్వాడ అజయ్ బలమైన నాయకుడు కావటం..ఖమ్మం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలవటంతో గ్రేటర్ కంటే ఖమ్మంలో అజయ్ అవసరం ఎక్కువ అవసరమని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఇదే సమయంలో అజయ్ ఖమ్మం కాదని..మరో నియోజకవర్గానికి వెళ్లే అవకాశం లేదని ఆయన అనుచర వర్గం చెబుతోంది. దీంతో, ఇప్పుడు శేరిలింగంపల్లి విషయంలో కేసీఆర్ తుది నిర్ణయం ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications