తండ్రిని ఏడిపించవద్దు, కవిత పార్టీ భవిష్యత్ తేల్చేసిన కేటీఆర్..!!
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. కవిత కొత్త పార్టీ పెట్టే అంశంపై తొలిసారి స్పందించారు. పిల్లలు తండ్రిని సంతోషపెట్టకపోయినా ఫర్వాలేదు గానీ.. ఏడిపించ వద్దని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తరువాత కేటీఆర్, హరీష్ లక్ష్యంగా కవిత సంచలన ఆరోపణలు చేసారు. కొత్త పార్టీ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. కాగా, కవిత కొత్త పార్టీ వేళ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ నిర్ణయం పైన కేటీఆర్ స్పందించారు. తొలి సారి కవిత వివాదం పైన స్పందించిన కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాజకీయ పార్టీని ఎవరైనా పెట్టవచ్చునని, అయితే పదవుల కోసం, వ్యక్తిగత సమస్యలతో పెట్టే పార్టీలు సక్సెస్ కావని వ్యాఖ్యానించారు. అదే సమయంలో పిల్లలు తండ్రిని సంతోషపెట్టకపోయినా ఫర్వాలేదు గానీ.. ఏడిపించవద్దంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కేటీఆర్.. మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలైనా రావచ్చని.. అయితే, ప్రజలు ఓట్లు వేయా లి కదా.. వ్యక్తిగత బాధలు చూపిస్తే ప్రజలు నమ్మరు కదా.. ఒకరిద్దరు వ్యక్తులు జైలుకు వెళ్లొచ్చి ముఖ్యమంత్రులు అయినంత మాత్రాన.. మళ్లీ అలా జరుగుతుందని అనుకోవడం పొరపాటని.. జైలుకెళ్తే సీఎం అవుతారనుకోవడం భ్రమగా కేటీఆర్ విశ్లేషించారు. ఎన్టీఆర్, వైఎస్సార్, చంద్ర బాబు, కేసీఆర్ రాష్ట్రాన్ని చరిత్రలో నిలిచిపోయేలా పాలించారని చెప్పుకొచ్చారు.

గతంలో పొరపాట్లు జరిగాయి.. సరి చేసుకుంటాం
కాగా, తమ కుటుంబంలో ఎలాంటి పదవుల గొడవలు లేవని కేటీఆర్ అన్నారు. టీఆర్‌ఎస్ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చాలంటూ ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నాయని, ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. గతంలో తాము చిన్న చిన్న తప్పులు చేశామని, ఆ లోపాలను సరిదిద్దుకుంటామని చెప్పారు. ప్రజా సమస్యలపై తాను 2027లో పాదయాత్ర చేపడతానని కేటీఆర్ ప్రకటించారు. పదేళ్ల కాలంలో పార్టీకి, ప్రజలకు మధ్య దూరం పెరిగిందని, దానిని తగ్గించేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని లోపాలను కేసీఆర్ బహిరంగంగానే అంగీకరించారని గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల స్థాయి నాయకత్వాన్ని సమన్వయం చేసుకోవడంలో తాము విఫలమయ్యామని అంగీకరించారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి లక్షలాది మంది కార్మికులు గల్ఫ్ దేశాల్లో ఉన్నప్పటికీ, వారి ప్రయోజనాల కోసం సరైన 'గల్ఫ్ పాలసీ'ని తీసుకురాలేకపోయామని పేర్కొన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడే దోచుకుంటున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications