హైదరాబాద్ పునర్విభజన పై కొత్త చర్చ షురూ..!!
హైదరాబాద్ పై ప్రభుత్వం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్ , రంగా రెడ్డి జిల్లాల పరిధిలోనూ మార్పులు చేస్తోంది. అటు మున్సిపల్ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ ఈ నిర్ణయాలు ఆసక్త కరంగా మారుతున్నాయి. రెవిన్యూ - పోలీసు పరంగా గ్రేటర్ పరిధిని ఒకే విధంగా ఖరారు చేస్తోంది. కాగా.. ఈ నిర్ణయాల పైన రాజకీయంగా చర్చ సాగుతోంది. హైదరాబాద్ విభజన .. కొత్త నగరాలకు పేర్లు ఖరారు వేళ కొత్త చర్చ మొదలైంది.
హైదరాబాద్ నగరం పై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పైన మాజీ మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు చేసారు. హైదరాబాద్ ను అడ్డగోలుగా విభజిస్తున్నారని విమర్శించారు. గూగల్ మ్యాప్ ఆధారంగా హైదరాబాద్‌ను విభజించినట్లు ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యం ఉందని తలసాని చెప్పారు. కానీ ఎంతో చరిత్ర ఉన్న సికింద్రాబాద్‌ను ఇష్టమొచ్చినట్లు విభజిస్తున్నారని మండిపడ్డారు. దీనికి వ్యతిరేకంగా ఈ నెల 17వ తేదీన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, ఇతరత్రా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రకటించారు. మద్దతిచ్చే పార్టీలతో కలిసి నిరసన తెలుపనున్నట్లు వెల్ల డించారు. టెక్నికల్ స్టడీ లేకుండానే ప్రాంతాలను విభజిస్తున్నారని విమర్శించారు.

అదే విధంగా జంట నగరాల ఉనికి లేకుండా కుట్ర చేస్తున్నారని తలసాని ఆరోపించారు. సికింద్రా బాద్ చరిత్రను, సంస్కృతిని నాశనం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ధైర్యం ఉంటే హైదరాబాద్ పేరు మార్చి చూడమని సీఎం రేవంత్ రెడ్డికి సవాలు చేసారు. మహానగర విభజన పై కాంగ్రెస్ నాయకులకు కనీసం అవగాహన లేదని తలసాని విమర్శించారు.
డివిజన్లను కూడా సరిగా విభజించలేదని అన్నారు. 24 నియోజకవర్గాలు ఉన్న మహానగరాన్ని విభజిస్తున్నప్పుడు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోలేదని తెలిపారు. ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసం బిఆర్ఎస్ హయాంలో 150 డివిజన్లు చేశామని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహానగరాన్ని ఇష్టమొచ్చినట్లు విభజిస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ పనుల కోసం ప్రజలు నగరం మొత్తం తిరిగే పరిస్థితి తీసుకొస్తున్నారని తెలిపారు. దీనిపై చట్టపరంగా, న్యాయపరంగా పోరాడతామని స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications