రేవంత్ రెడ్డి తమ్ముడికి రూల్స్ వర్తించవా?: కామారెడ్డిలో ఉద్రిక్తత
Revanth Reddy: తెలంగాణలో పోలింగ్ కొనసాగుతోంది. ఇంకొన్ని గంటల్లో దీనికి తెరపడనుంది. ఆశించిన స్థాయిలో పోలింగ్ శాతం నమోదు కావట్లేదు. మధ్యాహ్నం 3 గంటల వరకు 52 శాతం మేర మాత్రమే పోలింగ్ నమోదైనట్లు సమాచారం. పోలింగ్ ప్రక్రియ పూర్తిగా ముగిసేసరికి 60 శాతానికి పైగా చేరుతుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.
పోలింగ్ కొనసాగుతున్న సమయంలో కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీలో ఉన్న నియోజకవర్గం ఇది. తన కంచుకోట గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో కూడా కేసీఆర్ నామినేషన్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఆయనపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. కొడంగల్‌తో పాటు కామారెడ్డిలోనూ రేవంత్ నామినేషన్‌ను దాఖలు చేశారు. కేసీఆర్‌ను ఎలాగైనా సరే.. ఓడించి తీరాలనే పట్టుదలతో కామారెడ్డిలో పోటీకి దిగారు రేవంత్ రెడ్డి.
ఇక్కడ ఆయన తమ్ముడు కొండల్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఏజెంట్‌గా పని చేస్తోన్నారు. ఇది కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనలు, మార్గదర్శకాలకు వ్యతిరేకం అంటూ బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. స్థానికేతరుడు ఎలా ఉంటాడని, పోలింగ్ కేంద్రాన్ని ఎలా తనిఖీ చేస్తాడంటూ నిలదీస్తోన్నారు.

స్థానికేతులు ఎవరూ కూడా నియోజకవర్గం పరిధిలో ఉండకూడదంటూ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆదేశించినప్పటికీ.. కొండల్ రెడ్డి.. కామారెడ్డిలో తిష్ఠ వేయడం పట్ల బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోన్నారు. ఆయనను పోలింగ్ కేంద్రానికి రానివ్వకుండా అడ్డుకున్నారు.
తనతో పాటు కొత్త వ్యక్తులను పోలింగ్ కేంద్రంలోనికి తీసుకెళ్లడానికి కొండల్ రెడ్డి చేసిన ప్రయత్నాల పట్ల మండిపడ్డారు బీఆర్ఎస్ నాయకులు. ఏజెంట్ అయినంత మాత్రాన తన వెంట ఎవరినైనా పోలింగ్ కేంద్రంలోకి తీసుకొని వెళ్లొచ్చా? అంటూ నిలదీశారు. దీనితో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు జోక్యం చేసుకుని కొండల్ రెడ్డిని అక్కడి నుంచి పంపించేశారు.












Click it and Unblock the Notifications